కులగణన నిర్ణయం కేంద్రానిదే..తప్పనిసరిగా చేయాలని సుప్రీం కోర్టు చెప్పలే : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు

కులగణన నిర్ణయం కేంద్రానిదే..తప్పనిసరిగా చేయాలని సుప్రీం కోర్టు చెప్పలే : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు
  •     బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు

ముషీరాబాద్‌‌‌‌, వెలుగు: జనగణనలో కుల గణన చేపట్టాలా వద్దా అన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల పరిధిలోకి వచ్చే అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు తెలిపారు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గురువారం చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ కార్యాలయంలో ఎలికట్టే విజయ్‌‌‌‌కుమార్ గౌడ్ అధ్యక్షతన ‘సుప్రీంకోర్టు తీర్పు వాస్తవాలు–వక్రీకరణలు, కులగణన’ అంశంపై సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, దుర్గయ్య గౌడ్, కన్వీనర్ ఆయిలి వెంకన్న గౌడ్ తో కలిసి చిరంజీవులు మాట్లాడారు. కుల ఆధారిత జనగణన అంశం శాసనపరమైన విధాన నిర్ణయాలకు సంబంధించినదని తెలిపారు. ప్రస్తుత రిట్ పిటిషన్‌‌‌‌ను విచారించాల్సిన అవసరం లేదని భావించి కోర్టు దానిని కొట్టివేసిందని చెప్పారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కులగణన నిర్వహించాలని ఆదేశించలేదని స్పష్టం చేశారు. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ మొదటి నుంచే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయని గుర్తుచేశారు.