ఓటుకు నోటు కేసు.. మళ్లీ ఫస్ట్ నుంచి వినాల్సిందే..గత విచారణను రద్దు చేసిన సీజేఐ బెంచ్

ఓటుకు నోటు కేసు.. మళ్లీ ఫస్ట్ నుంచి వినాల్సిందే..గత విచారణను రద్దు చేసిన సీజేఐ బెంచ్
  •     తదుపరి విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓటుకు నోటు’ కేసు విచారణను మళ్లీ మొదటి నుంచి వినాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఇప్పటి వరకు ఈ కేసులో జరిగిన విచారణను సీజేఐ ధర్మాసనం రద్దు చేసింది. ఓటుకు నోటు కేసును ఎన్నికల చట్టాల నియామావళి కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేశారని, అందువల్ల ఈ కేసు చెల్లదని 22 జులై 2021న రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(క్రిమినల్) దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులోనే తన పేరును తొలగించాలని కోరుతూ సండ్ర వెంకటవీరయ్య 13 ఏప్రిల్ 2021న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు సైతం కోర్టులోపిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను గురువారం సీజేఐ, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ దామా శేషాద్రి నాయుడు, పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వకేట్ సిద్దార్థ్ లూథ్రా హాజరయ్యారు.

సుదీర్ఘ వాదనలు వినండి

విచారణ ప్రారంభం కాగానే.. ఇరువైపుల అడ్వకేట్లు సీజేఐ ధర్మాసనం ముందు పలు అభ్యర్థనలు ఉంచారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు వినాల్సి ఉందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించారు. మధ్యలో సీజేఐ జస్టిస్ స్యూర్యకాంత్ జోక్యం చేసుకొని.. గతంలో ఈ కేసు విచారణను చేపట్టిన బెంచ్‌‌‌‌లోని ఒక న్యాయమూర్తి పదవీ విరమణ చేశారని గుర్తు చేశారు. అందువల్ల ఈ కేసులో జరిగిన విచారణను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం మళ్లీ మొదటి నుంచి వింటుందని తెలిపారు.