- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
సైఫాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కల్లో బీసీ కులాల గణన చేపట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని బీసీ భవన్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ కులగణన కోసం దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం సుప్రీంకోర్టు తీర్పుతో తుది దశకు చేరిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం బీసీ కుటుంబాలను ప్రత్యేకంగా లెక్కించి, జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు స్పందించలేదని విమర్శించారు. ఢిల్లీలో జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలోనైనా బీసీ కులగణనపై నిర్ణయం తీసుకుని ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, మల్లేశ్వర్, కనకాల శ్యాం కుర్మా, దీటి మల్లయ్య, కౌలే జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
