ఫుల్​పవర్స్ ఎప్పుడొస్తయో?

ఫుల్​పవర్స్ ఎప్పుడొస్తయో?
  •                 పూర్తి అధికారాల కోసం సర్పంచ్​ల ఎదురుచూపులు
  •                 29 అధికారాలపై త్వరలో స్పష్టత ఇస్తామన్న సీఎం
  •                 13 అధికారాలు అప్పగించి, మరో 16 పెండింగ్
  •                 అన్ని అధికారాలను బదలాయించాలంటున్న సర్పంచ్​లు

‘విధులు, నిధులు అప్పగించండి. పంచాయతీలను అభివృద్ధి చేస్తం’.. ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించిన గ్రామ పంచాయతీ సర్పంచ్​ల ప్రధాన డిమాండ్​ ఇది. రాజ్యాంగ సవరణల ద్వారా వచ్చిన 29 అధికారాలను బదాలాయించాలని నాటి నుంచి డిమాండ్​ చేస్తూనే ఉన్నారు. వీటిలో 13 అధికారాలను పంచాయతీలకు అప్పగించినప్పటికీ మిగతా 16 అధికారాలను పెండింగ్​లో పెట్టారు. వీటి అప్పగింతపై ఆరు నెలలు గడుస్తున్నా స్పష్టత లేదు.

హైదరాబాద్, వెలుగు:

రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌‌‌‌ ప్రకారం 29 ప్రభుత్వ శాఖల అధికారాలను పంచాయతీరాజ్‌‌‌‌ సంస్థలకు కేటాయించాల్సి ఉంది. ఈ శాఖలు గ్రామ స్థాయిలో పంచాయతీలు, మండల స్థాయిలో మండల పరిషత్‌‌‌‌లు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్‌‌‌‌ పరిధిలో పనిచేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 13 శాఖల అధికారాలను అప్పగించి మిగతావి ఇవ్వలేదు. భౌతికంగా పంచాయతీరాజ్‌‌‌‌ సంస్థల పరిధిలోకి రావాల్సిన ప్రభుత్వ శాఖలు వేరుగానే పనిచేస్తున్నాయి. దీంతో వీటిని పంచాయతీలకు బదలాయించాలని సర్పంచ్ లు డిమాండ్​ చేస్తున్నారు. పంచాయతీల విధులు, నిధుల్లో దుర్వినియోగానికి పాల్పడితే సర్పంచ్ లపై కఠిన చర్యలకు వెనుకాడబోమని సీఎం పలుసార్లు హెచ్చరించారు. అధికార పార్టీ వాళ్లు ఉన్నా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గ్రామ సభ నిర్వహించనందుకు ఇప్పటికే నల్గొండ జిల్లాల్లో ఓ సర్పంచ్ ను సస్పెండ్​ చేశారు.

ఒక్కో రాష్ట్రం ఒక్కోలా అమలు

29 అధికారాలపై ఒక్కో రాష్ట్రం ఒక్కో పద్ధతి అమలు చేస్తోంది. గుజరాత్ లో 14 అంశాలను పూర్తిగా, మూడింటిని పాక్షికంగా స్థానిక సంస్థలకు బదిలీ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్న కేరళ.. 29 అధికారాలను స్థానిక సంస్థలకు బదిలీ చేసింది. పూర్తి హక్కులు కల్పించటంతో ఆయా శాఖల నుంచి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందుతున్నాయి. కర్ణాటకలోనూ అన్ని అధికారాలను స్థానిక సంస్థలకు ట్రాన్స్​ఫర్​ చేశారు. ఏపీ, తెలంగాణలో మాత్రం కొన్ని అధికారాలనే బదిలీ చేశారు. దీంతో ఆయా శాఖల నుంచి స్థానిక సంస్థలకు పాక్షికంగానే నిధులు అందుతున్నాయి.

ప్రభుత్వం బదలాయించాల్సిన అధికారాలు.

  1. సామాజిక అడవులు 2. ఇంధనం, పశుగ్రాసం 3. ఖాదీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలు 4. సంప్రదాయేతర ఇంధన వనరులు 5. విద్యుత్‌‌‌‌ పంపిణీ, గ్రామీణ విద్యుదీకరణ 6. ఆహారశుద్ధి, చిన్నతరహా పరిశ్రమలు 7. వయోజన, అనియత విద్య 8. సాంస్కృతిక కార్యక్రమాలు 9. కుటుంబ సంక్షేమం 10. గ్రంథాలయాలు 11. సామాజిక ఆస్తుల నిర్వహణ 12. మార్కెట్లు, ఫెయిర్లు 13. ప్రజాపంపిణీ 14.గ్రామీణ గృహనిర్మాణం 15. రోడ్లు, కల్వర్టులు, వంతెనలు, ఫెర్రీలు, జలమార్గాలు, రవాణాకు చెందిన ఇతరత్రా అధికారాలు. 16. సాంకేతిక శిక్షణ, వృత్తి విద్య.

అధికారాలిస్తేనే వేగంగా అభివృద్ధి

పదవిలోకి వచ్చి ఆరు నెలలు కావొస్తంది. పూర్తి అధికారాలు లేనపుడు అభివృద్ధి సాధ్యం కాదు. విధులు బదాలాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై త్వరగా స్పష్టత ఇవ్వాలి. నిధులు కూడా కేటాయించాలి. ‑ యాదగిరియాదవ్, మహబూబ్ నగర్ జిల్లా సర్పంచ్ ల సంఘం, ఉపాధ్యక్షుడు

కొత్త చట్టంలో వాటి ప్రస్తావనేది

గతేడాది కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 29 అధికారాల్లో ఒక్క దానిని కూడా ఆ చట్టంలో పేర్కొనలేదు. కోఆప్షన్ సభ్యుల నియామక అధికారాన్ని కూ డా ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంది. స్థానిక సంస్థలకు ఉండే అధికారాలు తగ్గిపోవ డంతో ఆయా శాఖల నుంచి నిధులు పంచాయతీలకు అందటం లేదు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ ను సైతం తొలగించే అధికారాన్ని ప్రభుత్వానికి ఉండేలా చట్టంలో పేర్కొన్నారు. పంచాయతీలపై పెత్తనం చేసేందుకే ఈ చట్టం తీసుకొచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.