పీసీసీ చీఫ్ పోస్టు కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఆ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. లోక్ సభ ఎన్నికల వరకే సీఎం రేవంత్ ను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తామని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడం, ఇక పాలనపై పూర్తిస్థాయిలో దృష్టిపెడతానని సీఎం రేవంత్ కూడా ఇటీవల చెప్పడంతో త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. త్వరలో రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నందున కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాల్సి ఉందని, అందుకోసం హైకమాండ్ కూడా కసరత్తు ప్రారంభించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎస్సీ కోటాలో ఇద్దరి పేర్లు..
ఎస్సీ కోటాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్లపై చర్చ సాగుతున్నది. సీఎం పదవి ఇవ్వకుండా డిప్యూటీ సీఎం పదవికి తనను పరిమితం చేశారని, ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ తనకే ఇవ్వాలని భట్టి అడిగే అవకాశం లేకపోలేదని ఆయన వర్గీయులు అంటున్నారు. కర్నాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారని.. ఈ నేపథ్యంలో తనకూ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరే ఆలోచనలో భట్టి ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక ఎస్సీ కోటాలోనే మరో నేత పేరు పరిశీలించాల్సి వస్తే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు చాన్స్ లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూల్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సీఎం రేవంత్ బుజ్జగించడంతో చివరకు వెనక్కి తగ్గారు. దీంతో ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి అయినా తనకు ఇవ్వాలని సంపత్ అడిగే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతున్నది.
బీసీ కోటాలో ముగ్గురి పేర్లు..
బీసీ కోటాలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఈయన కూడా పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఈయన రాహుల్ కు సన్నిహితుడని చెబుతారు. ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఈ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ కూడా ఈయన విషయంలో సానుకూలంగా ఉంటారనే ప్రచారం సాగుతున్నది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా పదవి ఆశిస్తున్నారు. అంజన్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించగా, ఆయన కూమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ పదవి దక్కడంతో సైలెంట్ గా ఉండిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పని చేసిన తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని అంజన్ కోరుతున్నట్టు సమాచారం. ఇక మైనార్టీ కోటాలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. రేవంత్ కూడా షబ్బీర్ విషయంలో సుముఖంగా ఉంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఎస్టీ సామాజికవర్గానికి ఇవ్వాల్సి వస్తే, మంత్రి సీతక్క పేరును పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు.