నెదర్లాండ్స్ యూదు పాఠశాలలో పేలుళ్లు.. ఇవి టార్గెటెడ్ అటాక్సే: మేయర్

నెదర్లాండ్స్ యూదు పాఠశాలలో పేలుళ్లు.. ఇవి టార్గెటెడ్ అటాక్సే: మేయర్

నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్‌డామ్‌లోని ఒక యూదు పాఠశాల లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున బాంబు పేలుడు జరిగింది. ప్రస్తుతం ఇది అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. దక్షిణ ఆమ్స్టర్‌డామ్‌లోని బ్యూటెన్‌వెల్డర్ట్ జిల్లాలో గల జీలాండ్‌స్ట్రాట్ స్ట్రీట్ లోని ఈ పాఠశాల వద్ద కొందరు వ్యక్తులు పేలుడు పదార్థాలను అమర్చారు. ఈ ప్రమాదంలో పాఠశాల భవనానికి స్వల్ప నష్టం వాటిల్లింది.. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగర మేయర్ ఫెమ్కే హల్సెమా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది యూదు సమాజాన్ని భయాందోళనలకు గురిచేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన పిరికిపంద దాడి అంటూ ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ ఘటన జరిగిన కొద్ది గంటల ముందే.. రోటర్‌డ్యామ్ నగరంలోని ఒక యూదు ప్రార్థనా మందిరంపై జరిగిన అర్సన్ దాడికి సంబంధించి నెదర్లాండ్స్ పోలీసులు 17 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల నలుగురు యువకులను అరెస్టు చేశారు. తాజా పేలుడులో అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో యూరప్ వ్యాప్తంగా యూదు సంస్థలపై దాడులు పెరుగుతుండటం ఆందోళనలు రేకెత్తిస్తోంది. గత వారం బెల్జియంలోని లైజ్ నగరంలో కూడా ఇలాంటి పేలుడే సంభవించింది. ఈ దాడులకు ఒక తీవ్రవాద టీం బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో వీడియోలను విడుదల చేసింది.

ప్రస్తుతం ఆమ్స్టర్‌డామ్‌లోని అన్ని యూదు పాఠశాలలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అక్కడి అధికారులు. నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ తరహా హింసాత్మక చర్యలను సహించేది లేదని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది. దర్యాప్తు సంస్థలు ఈ దాడులకు అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నాయి. మరికొందరు మాత్రం వీటి వెనుక ఇరాన్ స్లీపర్ సెల్స్ పనిచేస్తు్న్నాయా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే మిడిల్ ఈస్ట్ యుద్ధం కాస్తా యూరోపియన్ దేశాల ముంగిటకు చేరిందని చెప్పొచ్చు.