టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత ఎం. అర్జున్ రాజు కన్నుమూత

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత ఎం. అర్జున్ రాజు కన్నుమూత

టాలీవుడ్ లో  తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, రోజా ఆర్ట్స్ అధినేతల్లో ఒకరైన ఎం. అర్జున్ రాజు ఆనారోగ్యంతో ఈ రోజు ( మార్చి 14, 2026 ) కన్నుమూశారు.  ఆయన మృతి పట్ల పలువురు సినీ  ప్రముఖులు దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు అర్జున్ రాజు అందిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి టాలీవుడ్ కు తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేశారు.

రోజా ఆర్ట్స్ సంస్థ ద్వారా అర్జున్ రాజు అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. ప్రముఖ నిర్మాత శివరామరాజుతో కలిసి ఆయన 'కొండవీటి సింహం', 'వేటగాడు' వంటి  ప్రతిష్టాత్మక చిత్రాలను అందించారు. అప్పట్లో ఇవి భారీ విజయాన్ని సాదించడంతో పాటు టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చిపెట్టాయి. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కురిపించాయి. రోజా ఆర్ట్స్ తో పాటు రోజా ఎంటర్ ప్రైజెస్ , రోజా ఆర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కూడా పలు చిత్రాలను నిర్మించి నిర్మాత మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

అర్జున్ రాజు మరణంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర ద:ఖంలో  మునిగిపోయారు. అంత్యక్రియలు మార్చి 14, 2026న హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అర్జున్ రాజు మృతి పట్ల ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సినిమా నిర్మాణంలో నిబద్ధత, ప్రొఫెషనల్ ధోరణిలో పనిచేసే నిర్మాతగా ఆయనకు మంచి పేరు ఉందని కొనియాడు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని తెలిపారు.