పరీక్షకు లేటుగా వచ్చిన 399 మంది విద్యార్థులు.. కారణమేంటంటే..

పరీక్షకు లేటుగా వచ్చిన 399 మంది విద్యార్థులు.. కారణమేంటంటే..

తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం తలెత్తింది. హాల్ టికెట్ల జారీ విషయంలో సాంకేతిక సమస్యలు రావడంతో పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హాల్ టికెట్లలో పరీక్షా కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించటం వల్ల తాము సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో 63 కేంద్రాల్లో 75,727 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

సాంకేతిక కారణాలతో ఈ నెల 14, 15 వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఈ రోజు నుంచి యధావిథిగా పరీక్షలు జరగాల్సి ఉండగా… ఇప్పుడు పరీక్ష కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించటం మరో గందరగోళానికి దారి తీసింది. చిత్తూరు జిల్లా పీలేరులో 2 పరీక్షా కేంద్రాల్లో కలిపి మొత్తం 399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. కానీ, పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదు. హాల్ టికెట్ల జారీ విషయంలో ఎంత నిర్లక్ష్యం జరిగిందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమై ఇప్పటి వరకూ విశ్వవిద్యాలయ అధికారుల స్పందించకపోవటంతో విద్యార్థుల్లో మరింత ఆందోళన పెరిగింది. పరీక్షను మిస్సైన మాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.