విక్టోరియా.. మస్తు స్పెషల్

విక్టోరియా..  మస్తు స్పెషల్

దీనిపేరు విక్టోరియా. 6.6 కోట్ల ఏళ్ల క్రితం భూమ్మీద బతికింది. తోటి డైనోసార్​ మెడ, నోటిపై కొరకడంతో ఇన్​ఫెక్షన్​ సోకింది. ఆ ఇన్​ఫెక్షన్​ శరీరమంతా పాకడంతో యుక్త వయసులోనే చచ్చిపోయింది. దీని గురించి ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకంటే.. దీనికి ఓ స్పెషాలిటీ ఉంది. దాదాపు పూర్తి శిలాజాలు దొరికిన టీ–రెక్స్​ జాతికి చెందిన డైనోసార్​లలో ఇది రెండోది మాత్రమే. అందుకే అంత స్పెషల్​. అది చచ్చిపోయే నాటికి దాని వయసు కేవలం 18 నుంచి 25 ఏళ్లేనట. వచ్చే ఐదేళ్లలో ప్రపంచం మొత్తం ఇది చుట్టేసి వస్తదట. 2013లో సౌత్​ డకోటాలోని ఫెయిత్​లో దాని శిలాజాన్ని గుర్తించారు ఆర్కియాలజిస్టులు. 8 నెలలు కష్టపడి ఆ ప్రాంతం మొత్తం తవ్వితే దానికి సంబంధించిన 199 ఎముకలు దొరికాయి. వాటిని బ్రిటిష్​ కొలంబియాలోని విక్టోరియాలో ఉన్న ఓ ల్యాబ్​కు తీసుకెళ్లారు. అక్కడ వాటిని స్టడీ చేసి ఓపికగా ఇలా ఒక్కొక్క బొక్కను పేర్చి ఓ రూపునిచ్చారు.

విక్టోరియా ల్యాబ్​లో దానికి రూపునిచ్చారు కాబట్టి.. ‘విక్టోరియా’ అనే పేరునే దానికి పెట్టేశారు. ఎముకలన్నింటినీ పేరిస్తే 12 అడుగుల ఎత్తు, 40 అడుగుల పొడవు ఉందట అది. అయితే, పూర్తిగా పెరిగితే 14 అడుగుల ఎత్తువరకు ఉంటుందట. ఇంకో విషయమేంటంటే, అది చచ్చిపోయి కోట్ల ఏళ్లవుతున్నా దాని పుర్రె కొంచెం కూడా చెక్కుచెదరకపోవడం. అవును, మామూలుగా అయితే, ఇప్పటివరకు దొరికిన డైనోసార్​ శిలాజాల్లో వాటి పుర్రెలు ఎంతో కొంత ఛిద్రమయ్యాయి. ఇది మాత్రం చాలా పర్​ఫెక్ట్​గా ఉంది. విక్టోరియా బరువు 10.5 టన్నులట. తోటి డైనోసార్​ చేసిన దాడి వల్ల విక్టోరియా మెడకు పెద్ద దెబ్బే తగిలిందట. ఆ గాయం తాలూకు మచ్చ ఇప్పటికీ ఆ మెడ ఎముకపై ఉందట. క్వీన్​ మేరీ యూనివర్సిటీ ఆఫ్​ లండన్​కు చెందిన సైంటిస్టులు విక్టోరియాను పూర్తిగా స్టడీ చేశారు. దీనిపై స్టడీ చేయాలనుకునే సైంటిస్టులకు విక్టోరియా శిలాజాల త్రీడీ స్కాన్లు ఇస్తారట. ఈ ఏడాది నవంబర్​ 17 నుంచి విక్టోరియా ప్రపంచ యాత్ర మొదలు కానుంది. ఫీనిక్స్​లోని అరిజోనా సైన్స్​ సెంటర్​కు వెళుతుంది. 2020 మే 25 వరకు అది అక్కడే ఉండనుంది. ఆ తర్వాత వివిధ దేశాల్లోని మ్యూజియంలకు వెళుతుంది.