తహసీల్దార్ల ట్రాన్స్‌‌ఫర్లు పట్టని సర్కార్‌‌

తహసీల్దార్ల ట్రాన్స్‌‌ఫర్లు పట్టని సర్కార్‌‌

హైదరాబాద్‌‌, వెలుగుతమను పాత జిల్లాలకు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేయాలని తహసీల్దార్లు కొన్నాళ్లుగా చేస్తూ వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చాలా జిల్లాల్లో ట్రాన్స్​ఫర్ల ఫైల్‌‌ సిద్ధం చేసినప్పటికీ సీసీఎల్‌‌ఏ అప్రూవల్‌‌ చేయకపోవడంతో ట్రాన్స్‌‌ఫర్ల ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్ల వివరాలను సీసీఎల్‌‌ఏ చీఫ్‌‌ కమిషనర్‌‌ జూన్‌‌లోనే అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తెప్పించుకున్నప్పటికీ ట్రాన్స్‌‌ఫర్ల వ్యవహారం మాత్రం తేల్చలేదు. ఈ క్రమంలోనే నిజామాబాద్‌‌ జిల్లా రూరల్‌‌ తహసీల్దార్‌‌ జ్వాల గిరిధర్‌‌ రావు బుధవారం ఆత్మహత్య చేసుకోవడం రెవెన్యూ శాఖలో కలకలం రేపింది. ట్రాన్స్‌‌ఫర్ల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని రెవెన్యూ సంఘాలు మండిపడుతున్నాయి.

సంఘాల దరఖాస్తులు.. డస్ట్‌‌ బిన్‌‌లోకి..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు నిబంధనల మేరకు లాంగ్‌‌ స్టాండింగ్‌‌ తహసీల్దార్లను ఇతర జిల్లాలకు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశారు. సిద్ధిపేట జిల్లాకు చెందిన వారిని గద్వాల, నాగర్‌‌కర్నూల్‌‌, వనపర్తి జిల్లాలకు, నల్లగొండ జిల్లాకు చెందినవారిని నిజామాబాద్‌‌, కరీంనగర్‌‌ జిల్లాకు చెందినవారిని నిర్మల్‌‌, ఖమ్మం జిల్లాలకు బదిలీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్‌‌సభ ఎన్నికల వరకు అసిస్టెంట్‌‌ ఎలక్షన్‌‌ రిటర్నింగ్‌‌ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించారు. ఈ బాధ్యతలతోపాటు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పెండింగ్‌‌లో ఉన్న పాస్‌‌పుస్తకాలు జారీ చేశారు. ఎన్నికల ముందు అకడమిక్‌‌ ఈయర్‌‌ మధ్యలో ఈ ట్రాన్స్‌‌ఫర్లు జరగడంతో పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాలను షిఫ్ట్‌‌ చేయలేకపోయారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున పాత జిల్లాలకు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేస్తారనే భరోసాతో ఈ అకడమిక్‌‌ ఈయర్‌‌లో ఫ్యామిలీలు షిఫ్ట్‌‌ చేయలేదు. ఈ విషయంలో ట్రెసా, టీజీటీఏ ప్రతినిధులు సీసీఎల్‌‌ఏ చీఫ్‌‌ కమిషనర్‌‌ను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జులైలో తహసీల్దార్లు వర్క్‌‌ టూ రూల్‌‌ పాటించి నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం కనికరించలేదు. ట్రాన్స్‌‌ఫర్లు చేస్తామని అప్పటి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కానీ ఇప్పటి వరకు ట్రాన్స్‌‌ఫర్లు జరగలేదు. ఈ నెల 25న ట్రెసా ప్రతినిధులు మరోసారి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌‌ను కలిసి వినతిపత్రం సమర్పించినా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు.

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి   – వీఆర్వో, వీఆర్‌‌ఏ జేఏసీ

ప్రభుత్వ లీవులు, పండుగ రోజులు అనే తేడా లేకుండా రాత్రింబవళ్లు పనిచేయిస్తూ రెవెన్యూ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని తెలంగాణ వీఆర్వో, వీఆర్‌‌ఏ జేఏసీ నేతలు గరికె ఉపేందర్‌‌ రావు, లక్ష్మీనారాయణ, బాలనర్సయ్య, విజయరామారావు, హారాలే సుధాకర్‌‌రావు, వంగూరు రాములు విమర్శించారు. అధిక పనిభారానికి తోడు ట్రాన్స్‌‌ఫర్లు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగుల మీద సీఎం చేసిన దుష్ప్రచారం ఫలితంగా కొందరు నాయకులు రూల్స్‌‌ విరుద్ధంగా పనులు చేయమని బెదిరించడం, బ్లాక్‌‌మెయిల్‌‌ చేసి మానసికంగా వేధించడం పెరిగిపోయిందన్నారు.