కోర్టు ముందుకు కవిత.. ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ

కోర్టు ముందుకు కవిత..  ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్ లో ఉన్న కల్వకుంట్ల కవిత ను సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో గతంలో కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ టైం సోమవారంతో ముగియనుంది. దీంతో తీహార్ జైలు సిబ్బంది మరోసారి కవితను ట్రయల్ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. ఈ ఏడాది మార్చి 15 న హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి, అదేరోజు రాత్రి ఢిల్లీకి తరలించారు. 

మార్చి 16 న కవితను ట్రయల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో కవితను కింగ్ పిన్ గా ఈడీ వాదనలు వినిపించింది. కవిత నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని ఆరోపించింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. దీంతో రెండు దఫాలుగా మొత్తం 10 రోజులకు కవితను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అనంతరం మార్చి 26న కవితకు జ్యుడీషియల్ రిమాండ్​ విధించింది. కవిత తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11 న (రంజాన్ రోజు) కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. కోర్టు సీబీఐ కేసులోనూ జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. ప్రస్తుతం రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్​ కస్టడీ నేటి (సోమవారం)తో ముగియనుంది. 

చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్​ను పరిగణనలోకి తీసుకునే అంశంపై సోమవారం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నెల 10న కవితతోపాటు మరో నలుగురు నిందితుల పాత్రపై దాదాపు 200 పేజీల చార్జిషీట్ ను ఈడీ దాఖలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 45, 44(1) ప్రకారం ఈ అనుబంధ చార్జిషీట్ డాక్యుమెంట్స్ ను ట్రంకు పెట్టలో కోర్టుకు సమర్పించింది. ఎమ్మెల్సీ కవిత, ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్) దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్​ప్రీత్​ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ చానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్లాను తాజా చార్జిషీట్​లో నిందితులుగా పేర్కొంది. 

అయితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ కే మట్ట  ఈ నెల 14 న కవిత పై దాఖలు చేసిన చార్జిషీట్ అంశాన్ని స్పెషల్ జడ్జ్ దృష్టికి తెచ్చారు. కవితపై 8 వేల పేజీలతో కూడిన చార్జిషీట్ ను దాఖలు చేసినట్టు తెలిపారు. నిర్ణీత గడువులోపు దీన్ని దాఖలు చేశామని, పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా స్పందిస్తూ.. ముందు ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ సరైన పద్ధతిలో ఉందో ? లేదో పరిశీలిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత ఈ చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకోవాలనే విజ్ఞప్తిపై స్పందిస్తామని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను నేటి (సోమవారం)కి వాయిదా వేశారు.