
- మా పార్టీ ఎదుగుతున్నదని మోదీకి భయం మొదలైంది
- బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆప్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు
- భవిష్యత్తులో పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారని ఆరోపణ
- పలువురు కార్యకర్తల అరెస్టు
న్యూఢిల్లీ: ఆప్ ను అంతం చేయాలని బీజేపీ కుట్ర పన్నిందని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇందుకోసం ‘ఆపరేషన్ ఝాడు’ మొదలుపెట్టిందని చెప్పారు. తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా కేజ్రీవాల్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆప్ నేతలను ఒక్కొక్కరినీ అరెస్టు చేసే బదులు అందర్నీ ఒకేసారి అరెస్టు చేయాలని, తమ నేతలతో కలిసి బీజేపీ ఆఫీస్ దగ్గరికి వస్తానని శనివారం సవాల్ విసిరిన ఆయన.. ఆదివారం ఆప్ కార్యాలయం నుంచి ‘జైల్ భరో’ మార్చ్ చేపట్టారు.
అయితే దీనికి అనుమతిలేదని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో బీజేపీ ఆఫీస్ వైపు దూసుకెళ్లిన పలువురు ఆప్ కార్యకర్తలను అరెస్టు చేశారు. అంతకుముందు ఆప్ ఆఫీస్ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. ఆప్ శరవేగంగా ఎదుగుతున్నదని, అందుకే తమ పార్టీని అంతం చేయాలని బీజేపీ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు.
‘‘ఆప్ ఎదుగుదల చూసి ప్రధాని మోదీకి భయం మొదలైంది. అందుకే మన పార్టీని అంతం చేయాలని ‘ఆపరేషన్ ఝాడు’ మొదలుపెట్టారు. దీన్ని మూడు భాగాలుగా అమలు చేస్తున్నారు. మొదట ఆప్ ముఖ్య నేతలను అరెస్టు చేస్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు. మన ఆఫీసును కూడా లాక్కుంటారు. మనల్ని రోడ్డుపైకి తీసుకొస్తారు. మనం గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం.. ఇప్పుడు భవిష్యత్తులో రాబోయే సవాళ్లను కూడా ఎదుర్కొందాం” అని అన్నారు. ‘ఆప్ నేతలపై బీజేపీ తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్నది.
2015లో నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాపై ఎన్నో ఆరోపణలు చేసింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటూ అరెస్టు చేసింది. నిజంగా స్కామ్ జరిగి ఉంటే, మరి అందులో దొరికిన డబ్బులేవి?” అని ప్రశ్నించారు. కాగా, ఆప్ మార్చ్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు బీజేపీ ఆఫీస్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐటీవో
మెట్రో స్టేషన్ను తాత్కాలికంగా మూసివేశారు.
ఆప్ నేతలపై మలివాల్ ఆగ్రహం..
ఆప్ నేతల తీరుపై స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో నిర్భయకు న్యాయం జరగాలని మనమంతా రోడ్డెక్కాం.. పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు ఒక నిందితుడిని కాపాడేందుకు మీరంతా రోడ్డుపైకి వచ్చారని విమర్శించారు. ఒకవేళ ఇప్పుడు మనీశ్ సిసోడియా బయట ఉండి ఉంటే, తనకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాగా, ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో అరెస్టు చేసిన బిభవ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. బిభవ్కు కోర్టు 5 రోజుల కస్టడీ విధించింది.