Upendra : రజనీ సర్ పక్కన ఒక్క షాట్ చాలు.. 'కూలీ'లో తక్కువ నిడివిపై ఉపేంద్ర క్రేజీ కామెంట్స్

Upendra : రజనీ సర్ పక్కన ఒక్క షాట్ చాలు.. 'కూలీ'లో తక్కువ నిడివిపై ఉపేంద్ర క్రేజీ కామెంట్స్

కన్నడ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న రియల్ స్టార్ ఉపేంద్ర. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి 'కూలీ' (Coolie) చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో ఉపేంద్ర స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విమర్శలపై ఉపేంద్ర లేటెస్ట్ గా స్పందిస్తూ తన మనసులోని మాటను బయటపెట్టారు.

అభిమానిని కాదు.. భక్తుడిని!

తన పాత్ర నిడివి గురించి వస్తున్న కామెంట్స్‌పై ఉపేంద్ర స్పందిస్తూ.. నేను కేవలం రజనీ సార్ కోసమే ఈ సినిమా చేశాను. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నిజం చెప్పాలంటే నేను ఆయనకు కేవలం అభిమానిని మాత్రమే కాదు, భక్తుడిని. ఆయన నటన, ప్రతిభ, ఆయన జీవన విధానం నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని చెప్పారు. తలైవా అంటే తలైవాయే! ఆయన పక్కన ఒక్క షాట్‌లో కనిపించమన్నా నేను సిద్ధమే అని ఉపేంద్ర తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

మొదట ఒక్క ఫైట్ మాత్రమే..

సినిమా ఒప్పుకున్నప్పుడు తన పాత్ర పరిధి చాలా తక్కువగా ఉందని ఉపేంద్ర వెల్లడించారు. మొదట నేను ఈ సినిమాకు సంతకం చేసినప్పుడు నాకు కేవలం ఒక ఫైట్ సీన్ మాత్రమే ఉంది. కానీ, ఆ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ నా పాత్రను మరికొన్ని సీన్ల వరకు పొడిగించారు. ఆయన పక్కన నిలబడే అవకాశం వచ్చినా చాలని నేను అనుకున్నాను. అలాంటిది ఒక ముఖ్యమైన పాత్ర దక్కడం నా అదృష్టం అని చెప్పుకొచ్చారు.. పాత్ర నిడివి కంటే, సినిమాలో తన ప్రాముఖ్యత , తలైవాతో ఉన్న అనుబంధమే ముఖ్యమని స్పష్టం చేశారు.

►ALSO READ | Theater Movies: క్రిస్మస్ ట్రీట్‌గా ప్రేక్షకులకు భారీ వినోదం.. రేపు (Dec25) థియేటర్లలోకి 8 సినిమాలు.. ఇంట్రెస్టింగ్ జోనర్లలో

'కూలీ'లో కాలీషా

'కూలీ'చిత్రంలో ఉపేంద్ర 'కాలీషా' అనే పాత్రలో కనిపించారు. రజనీకాంత్ పోషించిన 'దేవా' పాత్రకు ప్రాణస్నేహితుడిగా.. కూలీల హక్కుల కోసం పోరాడే యోధుడిగా ఉపేంద్ర నటనకు మంచి గుర్తింపు లభించింది. రజనీ, ఉపేంద్ర మధ్య వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, ఉపేంద్ర తనదైన ముద్ర వేశారు.

వరుస సినిమాలతో బిజీ..

ప్రస్తుతం ఉపేంద్ర తన తదుపరి కన్నడ చిత్రం '45' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అర్జున్ జన్యా దర్శకత్వంలో శివరాజ్ కుమార్, రాజ్ బి శెట్టిలతో కలిసి ఆయన నటించిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇది కాకుండా 'బుద్ధిమంత 2', 'త్రిశూలం', 'గెరిల్లా వార్' వంటి ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి.