
న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో ఢిల్లీలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ నార్త్ ఈస్ట్ లోక్సభ సీటు నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కన్నయ్య కుమార్ కు మద్దతుగా ఆదివారం ఆమె ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశ ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పదేండ్లుగా అధికారంలో ఉన్న పార్టీ విపక్షాలపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.
పేద మహిళలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో బీజేపి విఫలమైందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఇచ్చిన హామీలను అమలు చేసిందని గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళలకు స్వయంశక్తిని కల్పించే దిశలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. నియంత పాలన తేవాలని మోదీ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ కుట్రలను చేధిస్తామని.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.