- అక్టోబర్ నోటిఫికేషన్ ప్రకారమే ప్రవేశాలు కల్పించాలి: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, మైనారిటీ, నాన్‌మైనారిటీ మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల అడ్మిషన్‌ల కోసం మేనేజ్‌మెంట్ కోటాలో స్థానికులకు 85 శాతం, ఆల్ ఇండియాకు 15 శాతం రిజర్వేషన్‌లు వర్తించవని హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది.
ప్రస్తుత అకడమిక్ ఇయర్ అడ్మిషన్‌లకు ప్రభుత్వం ఇటీవల సవరించిన నిబంధనలు వర్తించవని తెలిపింది. అక్టోబర్ నోటిఫికేషన్ ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. బెంగళూరు, రాజస్తాన్, తిరుపతికి చెందిన అభ్యర్థులు మేనేజ్‌మెంట్ కోటాలోని పీజీ మెడికల్, డెంటల్ అడ్మిషన్‌లకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాన్ని (జీఓ 200, 201) సవాల్ చేశారు. నవంబర్ 3న జారీ చేసిన ఈ జీఓలు ప్రస్తుత అడ్మిషన్ ప్రక్రియకు వర్తించవని పిటిషన్‌లలో తెలిపారు.
దీన్ని చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ శుక్రవారం విచారించింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదిస్తూ..అక్టోబర్ 4న కాళోజీ మెడికల్ వర్సిటీ పీజీ మెడికల్ అడ్మిషన్‌లకు నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, మైనారిటీ, నాన్‌మైనారిటీ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు సంబంధించి నిబంధనలు సవరించడం ద్వారా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు నష్టం జరుగుతోందని చెప్పారు.
స్థానికత ఆధారంగా సీట్ల కేటాయింపు ఎంబీబీఎస్ స్థాయికి మాత్రమే వర్తిస్తుందని వాదించారు. ఈ రిజర్వేషన్‌లతో ప్రత్యేకంగా బయటి రాష్ట్రాల అభ్యర్థులకు అవకాశాలు తగ్గుతాయన్నారు. వాదనలు విన్న బెంచ్.. ప్రస్తుత అడ్మిషన్‌లకు ఈ రిజర్వేషన్ నిబంధనలు వర్తించవని మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.
దీనిపై పూర్తి వివరాలతో4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, కాళోజీ వర్సిటీకి, ఆ తరువాత రిప్లై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.
