షూ తడవకూడదని మత్స్యకారుడి భుజాలపై ఎక్కిన మంత్రి

షూ తడవకూడదని మత్స్యకారుడి భుజాలపై ఎక్కిన మంత్రి

చెన్నై: షూ తడవకుండా పడవ దగ్గర నుంచి ఒడ్డుకు చేరడానికి తమిళనాడు మత్స్య శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ చేసిన పని వివాదాస్పదంగా మారింది. ఆయనను ఒక మత్స్యకారుడు ఎత్తుకుని తీసుకెళ్లిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు, రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రజల భుజాలపై ఎక్కి కూర్చునే వీఐపీ కల్చర్‌‌ను మానుకోవాలంటూ మంత్రిపై మండిపడుతున్నారు.
సముద్రపు అలల కారణంగా కోతకు గురవుతున్న పాలవేర్కడు గ్రామాన్ని పరిశీలించేందుకు తమిళనాడు మత్స్య శాఖ మంత్రి, డీఎంకే సీనియర్ నేత అనితా రామకృష్ణన్ వెళ్లారు. ఆయన అక్కడి ప్రజలతో మాట్లాడిన తర్వాత పడవలో సముద్రంలోకి వెళ్లారు. తిరిగి వెనక్కి వచ్చాక పడవలో నుంచి కిందికి దిగేందుకు అక్కడ ఒక కుర్చీ వేశారు. కానీ ఆయన తన షూ తడిచిపోతుందని, అడుగు ముందుకేసేందుకు తటపటాయించారు. దీంతో ఓ మత్స్యకారుడు ఆయనను ఎత్తుకుని, ఒడ్డు వరకూ మోసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. 
ప్రేమతో వాళ్లే అడిగారు.. తప్పేంటి?
ఈ ఘటనపై తన తప్పేంలేదంటూ మంత్రి అనితా రాధాకృష్ణన్ స్పందించారు. ‘‘ఇందులో తప్పేముంది? వాళ్లు ప్రేమతో ఎత్తుకుని తీసుకెళ్లి ఒడ్డున దింపుతామని అడిగారు. నేను డిమాండ్‌ చేసి బలవంతంగా వాళ్ల భుజాలపై ఎక్కితే.. అది తప్పు. మత్స్య శాఖ మంత్రిని ఓ మత్స్యకారుడు మాత్రమే తన భుజాలపై ఎత్తుకుంటాడు.. అంతేతప్ప మరెవరు ఎత్తుకుంటారు?” అని ఆయన అన్నారు.