
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల వాడకం ఈ మధ్య బాగా పెరిగింది. క్రెడిట్ లిమిట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ షాపింగ్ చేయొచ్చు. అందుకే చాలా మంది యూజర్లు క్రెడిట్ లిమిట్ పెంచమని కార్డు కంపెనీలకు రిక్వెస్ట్ కూడా చేస్తారు. ఒకవేళ బ్యాంక్ మీ క్రెడిట్ లిమిట్‌ను తగ్గిస్తే ఏమవుతుంది? అలా జరిగితే, ముందు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తగ్గించడానికి గల కారణాన్ని కనుక్కోవాలి. మళ్లీ లిమిట్ పెంచాలని బ్యాంక్‌కు రిక్వెస్ట్ పెట్టొచ్చు. లిమిట్ తగ్గడానికి కారణమయ్యే విషయాలకు ఫ్యూచర్‌లో దూరంగా ఉండొచ్చు.
క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గడానికి 5 కారణాలు
బకాయిలు పెరగడం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం, మార్చి 2023 నాటికి క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ రూ.4,072 కోట్లకు చేరింది. యూజర్లు క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించడంలో ఆలస్యం చేస్తే, బ్యాంక్ అలాంటి వాళ్లను రిస్కీ కస్టమర్లుగా చూస్తుంది. కస్టమర్ బకాయిలు చెల్లించలేడని భావించి, క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను తగ్గిస్తుంది.
మినిమం బకాయిని క్యారీ ఫార్వర్డ్ చేయడం: కొందరు క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూస్ చెల్లించి, బాకీని తర్వాత నెలకు క్యారీ చేస్తారు. బాకీ మీద వడ్డీ చెల్లిస్తారు కాబట్టి ఒకటి రెండు సార్లు అయితే పర్లేదు. అది క్రెడిట్ కార్డ్ కంపెనీకి లాభం. కానీ ఇది అలవాటుగా మారితే, యూజర్ బకాయిలు పెరిగిపోతాయి. అప్పుల ఊబిలో చిక్కుకుపోతారు. అప్పుడు లోన్ తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. ఇది కంపెనీకి రిస్క్. అందుకే లిమిట్ తగ్గిస్తుంది.
అతిగా వాడడం : కొందరు కస్టమర్లు క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను అవసరానికి మించి వాడతారు. లిమిట్లో వాడిన అమౌంట్ రేషియోని యుటిలైజేషన్ రేషియో అంటారు. ఈ రేషియో ఎక్కువైతే క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు, కస్టమర్ కార్డ్ లిమిట్ రూ.లక్ష ఉంటే, అతను ప్రతి నెలా 80–-95 వేలు వాడారనుకుందాం. క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఇలాంటి వాళ్లను ఎక్కువగా లోన్లు తీసుకునే రిస్కీ యూజర్లుగా చూస్తాయి. అందుకే లిమిట్ తగ్గిస్తాయి.
ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండడం: కొందరు వరుసగా చాలా క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు. దీంతో వాళ్ల మొత్తం లిమిట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఒక కార్డ్ లిమిట్ రూ. లక్ష ఉంటే, అలాంటి యూజర్ దగ్గర 10 కార్డ్స్ ఉంటే, మొత్తం లిమిట్ రూ.10 లక్షలు అవుతుంది. ఇలా ఎక్కువగా వాడితే, బ్యాంక్ అలాంటి కస్టమర్‌ను లోన్స్‌పై ఎక్కువగా ఆధారపడే వాడిగా చూస్తుంది. రిస్కీ యూజర్‌గా భావిస్తుంది. అప్పుడు కూడా లిమిట్ తగ్గించొచ్చు.
కార్డును పెద్దగా వాడకపోవడం: కొందరు కస్టమర్లు క్రెడిట్ కార్డ్ తీసుకున్నా, దాన్ని సరిగ్గా వాడరు. తెలియక పోవడం వలనో లేదా ఇష్టం లేకనో పెద్దగా ఉపయోగించరు. ఇలాంటి కస్టమర్స్ లిమిట్‌ను కూడా బ్యాంకులు తగ్గిస్తాయి, ఎందుకంటే కార్డ్ ఎక్కువగా వాడితేనే బ్యాంకులకు లాభం వస్తుంది. అలాగే, ఎకానమీలో అస్థిరత వచ్చి ప్రజలు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొంటే, చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీలు కస్టమర్స్ లిమిట్ తగ్గిస్తాయి. ప్రజలు బకాయిలు చెల్లించలేరని కంపెనీలు ఫీలవుతాయి. ఉదాహరణకు, కరోనా మహమ్మారి సమయంలో ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు, చాలా కంపెనీలు క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను తగ్గించాయి.