ఉపాధ్యాయులు పోరాటాలతోనే హక్కులు సాధించాలి : చుక్కా రామయ్య

ఉపాధ్యాయులు పోరాటాలతోనే హక్కులు సాధించాలి : చుక్కా రామయ్య

ఉపాధ్యాయులు పోరాటాల ద్వారానే తమ హక్కులను సాధించాలని ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో పైరవీలు చేయడం ఉద్యమస్ఫూర్తికి విరుద్ధమన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తో కలిసి చుక్కా రామయ్య పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యకర్తల మధ్య ఉండటమే తనకు సంతోషమని, కార్యకర్తల మధ్యనే తుదిశ్వాస విడవాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. అందుకే  టీఎస్ యూటీఎఫ్ నాయకులు తనకు ఓపిక లేదు.. వద్దు అన్నా ఆవిష్కరణకు వచ్చానని చుక్కా రామయ్య తెలిపారు.

రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులు, నియామకాలు లేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చెప్పారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించలేదని ఆరోపించారు. కనీసం నూతన సంవత్సరంలో అయినా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ పై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. మన ఊరు - మన బడి,  ఇంగ్లీషు మీడియం వంటి పథకాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు.