- గావస్కర్ చొరవ చూపించాడు
- ఎక్స్‌పీరియెన్స్ లేకపోయినా జాబ్ ఇచ్చారు
- టీమిండియా మాజీ కోచ్ కిర్‌స్టెన్
న్యూఢిల్లీ: కోచింగ్ జాబ్ అంటే తనకు ఇష్టంలేని పరిస్థితుల్లో.. కనీసం అప్లై చేసే ఆసక్తి లేని నేపథ్యంలో.. జస్ట్ ఏడు నిమిషాల్లో టీమిండియాకు కోచ్‌గా ఎంపికయ్యానని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టెన్ అన్నాడు. ఇండియా లెజెండ్ సునీల్ గావస్కర్ చొరవతోనే తనకు ఆ పదవి వచ్చిందన్నాడు. 2007 లో తను కోచ్‌గా మారడానికి దారితీసిన విచిత్ర సంఘటనల గురించి ‘క్రికెట్ కలెక్టివ్ పోడ్కాస్ట్’తో గ్యారీ పంచుకున్నాడు. ‘గ్రెగ్ చాపెల్ వారసుడి కోసం బీసీసీఐ వెతుకుతున్న రోజులవి. సెలెక్షన్ ప్యానెల్ మెంబర్ అయిన గావస్కర్ నుంచి నాకు ఓ మెయిల్ వచ్చింది. ఇండియా టీమ్‌కు కోచింగ్ ఇచ్చే ఆసక్తి ఉందా? అని దాని సారాంశం. అయితే ఇదేదో గాలి వార్త అనుకుని వదిలేశా. కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. కానీ రెండోసారి మళ్లీ మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూకు వస్తావా? అని అందులో రాసి ఉంది. ఈ మెయిల్‌ను నా భార్యకు చూపిస్తే ఎవరో రాంగ్ పర్సన్ నీకు పంపినట్లు ఉన్నారని చెప్పింది. ఎందుకంటే నాకు కోచింగ్ ఎక్స్‌పీరియెన్స్ లేదు. కాబట్టి నన్నెవరు పిలుస్తారని భావించా. సరే మెయిల్ వచ్చింది కదా అని ఇంటర్వ్యూ కోసం ఇండియాకు వచ్చా. ఆ క్రమంలో అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లేను కలిశా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అనిల్ నన్ను అడిగాడు. నీకు కోచింగ్ ఇవ్వడానికి వచ్చానని చెప్పా. దీంతో ఇద్దరం కాసేపు పగలబడి నవ్వుకున్నాం’ అని కిర్‌స్టెన్ గుర్తు చేశాడు.
నా ఆన్సర్ రవికి నచ్చింది…
ఇంటర్వ్యూ కోసం తాను ఏమాత్రం ప్రిపేర్ కాలేదని గ్యారీ వెల్లడించాడు. అయితే ఇప్పటి చీఫ్ కోచ్, అప్పటి కమిటీ మెంబర్ రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు తాను ఇచ్చిన జవాబు అందరికీ నచ్చిందన్నాడు. ‘ముందుగా బీసీసీఐ అధికారులతో మీటింగ్ జరిగింది. ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ గురించి నీ ఆలోచనలు, దృక్పథం ఏంటి? అని నన్ను ప్రశ్నించారు. వాటి గురించి ఇప్పటికిప్పుడు చెప్పడం కొద్దిగా కష్టం. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి రావాలని నాకు ఎవరూ చెప్పలేదు. నేను అలా వచ్చేశా అని ఓపెన్‌గా చెప్పాను. అప్పుడు రవి జోక్యం చేసుకుని.. ఇండియాను ఓడించడానికి సౌతాఫ్రికా ఎలాంటి స్ట్రాటజీలు పన్నుతుందని అడిగాడు. అయితే నేను స్ట్రాటజీల జోలికి వెళ్లకుండా మనం మ్యాచ్ చూస్తున్నప్పుడు వ్యవహరించే తీరును గుర్తుకు చేసుకుంటూ రెండు, మూడు నిమిషాలు ఏదో ఆన్సర్ చెప్పా. అది రవితో పాటు అక్కడి బోర్డు మెంబర్స్‌కు బాగా నచ్చింది. మూడు నిమిషాల ఇంటర్వ్యూ కాస్తా ఏడు నిమిషాలకు వెళ్లింది. వెంటనే బోర్డు సెక్రటరీ కాంట్రాక్ట్ పేపర్స్ తీసి సైన్ చేయమని ఇచ్చారు’ అని గ్యారీ వివరించాడు.
చాపెల్ పేరుంది..
కాంట్రాక్ట్ పేపర్లపై గ్రెగ్ చాపెల్ పేరు ఉండ టంతో కాస్త ఆశ్చర్యానికి లోనయ్యానని గ్యారీ అన్నాడు. కాంట్రాక్ట్ పేపర్స్ ఫస్ట్ పేజీలో నా పేరు ఉందేమో అని చూశా. కానీ ఎక్కడా లేదు. గ్రెగ్ పేరు రాసి ఉంది. వెంటనే పేపర్లను వెనక్కి ఇస్తూ.. సర్ మీరు చాపెల్ కాంట్రాక్ట్‌ను నాకు ఇస్తున్నారా? అని అడిగా. ఈ ప్రశ్న అక్కడున్న వాళ్లకు కొంత విచిత్రంగా, ఇబ్బందిగా అనిపించింది. వెంటనే పాకెట్లో నుంచి పెన్ తీసి చాపెల్ పేరు కొట్టేసి నా పేరు రాశారు. నేను కూడా పెద్ద కోరికలు కోరకుండానే కాంట్రాక్ట్‌పై సంతకం చేసి బయటపడ్డా’ అని గ్యారీ చెప్పాడు. కోచింగ్ ఎక్స్‌పీరియెన్స్ లేకపోయినా.. టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కోచ్‌గా గ్యారీ పేరు తెచ్చుకున్నాడు. 2009లో టెస్ట్‌ల్లో టీమ్‌ను నంబర్‌వన్‌గా నిలపడంతో పాటు 2011లో వన్డే వరల్డ్‌కప్‌ను అందించాడు.




