అసెంబ్లీ నిరవధిక వాయిదా..8 రోజులపాటు కొనసాగిన సమావేశాలు

అసెంబ్లీ నిరవధిక వాయిదా..8 రోజులపాటు కొనసాగిన సమావేశాలు

 

  •     నాలుగు బిల్లులకు సభ ఆమోదం
  •     తొలి రోజే అసెంబ్లీ ముందు బీఆర్​ఎస్ హైడ్రామా
  •     స్పీకర్​పై ఎమ్మెల్సీల అనుచిత వ్యాఖ్యలు
  •     రెండో రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

 


 
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. 8 రోజులు, 51 గంటల 52 నిమిషాలపాటు అసెంబ్లీ సమవేశాలు జరిగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. మొత్తం నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. క్యూర్ బిల్లు, మున్సిపాలిటీ సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు, ప్రజా విశ్వాసం బిల్లులకు ఆమోదం లభించింది. నాలుగు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో 22 ఏలో భాగంగా ధరణి పోర్టల్ లోపాలు, ఎల్‌‌ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వాతావరణ మార్పులు, రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాలపై చర్చించారు. 2027 జాతీయ జనాభా గణనలో వెనుకబడిన తరగతుల లెక్కింపును ప్రత్యేకంగా చర్చ జరిగింది.  కోర్ అర్బన్ రీజియన్  ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ ( క్యూర్) బిల్లు, హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్ధి కోసమై 1955 నాటి పాత జీహెచ్‌‌ఎంసీ చట్టం స్థానంలో తీసుకొచ్చారు. ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సుధీర్ఘంగా మాట్లాడారు. 

స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అనుచిత వ్యాఖ్యలు.. 

అసెంబ్లీ సమావేశాల తొలి రోజే బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్లు రాసిన నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవటంతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు  తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి.. స్పీకర్ ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం రెండో రోజు కేసీఆర్ పై షాద్ నగర్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్ పోడియం ముందు గంటపాటు నినాదాలు చేస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. పలుమార్లు ఆందోళన విరమించాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారిని వారించిన వినకపోవటంతో ఈ సెషన్ మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ ​చేశారు.