- ఎఫ్ఆర్బీఎం 3.5 శాతానికి పెంచాలి
- 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
- రాష్ట్రంలో 20% లోటు వర్షపాతం నమోదు
- పరిశీలనకు కేంద్ర బృందాన్ని పంపండి
- 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్ కావాలె
- మరో 50 ‘ఉపాధి’ పని దినాలు పెంచాలె
- కేంద్రానికి తెలంగాణ శాసన సభ విజ్ఞప్తి
- తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
- ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అసెంబ్లీ
హైదరాబాద్, వెలుగు:ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ శాసనసభ విజ్ఞప్తి చేసింది. తాగు, సాగునీటి అవసరాలు, భూగర్భ జలాల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు వెంటనే రూ. 20 వేల కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన పలు తీర్మానాలకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. విపత్తు ఉపశమన, నివారణ చర్యల వల్ల రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారాన్ని తట్టుకునేందుకు వీలుగా 2026–-27 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని జీఎస్‌డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేసింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్‌ఎఫ్) నుంచి తగినంత ప్రత్యేక సాయాన్ని వెంటనే మంజూరు చేయడంతోపాటు ఎస్డీఆర్‌ఎఫ్‌లో కేంద్ర వాటా నిధులను సత్వరమే విడుదల చేయాలని కోరింది. అటు ఉపాధి పనిదినాలను 175 రోజులకు పెంచాలని, రాష్ట్రానికి అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలని అసెంబ్లీ తీర్మానించింది.
19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు..
33 జిల్లాలకుగానూ 19 జిల్లాలు వర్షాభావ కేటగిరీలోకి వెళ్లిపోగా, పలు ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రానికి పంపిన తీర్మానంలో పేర్కొన్నారు. ‘‘జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 664.5 మిల్లీ మీటర్లు కాగా, కేవలం 536.5 మిల్లీ మీటర్లే నమోదైంది. దీని వల్ల ఏకంగా 20 శాతం లోటు ఏర్పడింది. సెప్టెంబర్‌లో రుతుపవనాలు మరింత బలహీనపడతాయన్న ఐఎండీ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి’’ అని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన ఈ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్రానికి పంపాలని అసెంబ్లీ కోరింది. కరవు కోరల్లో చిక్కుకున్న అన్నదాతలకు పంట నష్టం, ఇన్‌పుట్ సబ్సిడీని నేరుగా అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ప్రజల గొంతు తడిపేందుకు తాగునీటి సరఫరా, పశుసంపద రక్షణకు అవసరమైన పశుగ్రాసం సమకూర్చడం, అడుగంటిన భూగర్భ జలాల పునరుద్ధరణ పనులకు అవసరమైన నిధులను తక్షణమే సమకూర్చాలని కోరింది. అవసరమైతే ఈ సహాయ చర్యల కోసం కేంద్ర విపత్తు నిబంధనలను సడలించాలని సభ ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన 4 తీర్మానాలు ఇవే..
1. రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
తాగు, సాగునీటి అత్యవసరాలు, కరవు నివారణ చర్యలు, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ. 20 వేల కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీని మంజూరు చేయాలి. విపత్తు ఉపశమన, నివారణ చర్యల వల్ల రాష్ట్ర ఖజానాపై పడే అదనపు వ్యయాన్ని తట్టుకునేందుకు వీలుగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని జీఎస్‌డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలి. బలహీన వర్గాలు, కౌలు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) కింద అదనపు ఆర్థిక సాయం అందిస్తూ నిబంధనలను సడలించాలి.
2. ఎల్‌నినో అధ్యయనానికి కేంద్ర బృందం
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన దుర్భిక్ష పరిస్థితులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని వెంటనే రాష్ట్రానికి పంపించాలి. ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి తగినంత ప్రత్యేక సాయం మంజూరు చేయడంతోపాటు ఎస్డీఆర్‌ఎఫ్‌లో కేంద్ర వాటా నిధులను సత్వరమే విడుదల చేయాలి. పంట నష్టం, ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు నేరుగా అందించి, తాగునీరు, పశుగ్రాసం సరఫరా కోసం విపత్తు నిబంధనలను సడలించాలి.
3. ఉపాధి పనిదినాలను 175 రోజులకు పెంచాలి
వ్యవసాయ పనులు లేక అల్లాడుతున్న గ్రామీణ కూలీలకు భరోసా కల్పించేందుకు వీబీ -జీ రామ్ జీ (ఉపాధి హామీ) పథకం కింద 125 రోజులకు అదనంగా మరో 50 పనిదినాలు కల్పించాలి. ఈ అదనపు వ్యయాన్ని వంద శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ, రాష్ట్రంలో అమల్లో ఉన్న 60 రోజుల సీజనల్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి. వర్షాభావ జిల్లాలకు రైల్వే రేక్‌ల ద్వారా ఎరువులను సకాలంలో చేరవేయాలి. ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ కింద డ్రిప్ ఇరిగేషన్ కేటాయింపులను పెంచడంతోపాటు ఎంఐడీహెచ్ కింద కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీపై అందించాలి.
4.1,500 మెగావాట్ల అదనపు విద్యుత్ కేటాయించాలి
వర్షాభావం వల్ల పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు కేంద్ర ఉత్పత్తి సంస్థల్లోని అన్ అలొకేటెడ్ కోటా నుంచి తెలంగాణకు అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్తును కేటాయించాలి. రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిరంతరం పనిచేసేందుకు విండో-1 కింద 5 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీని ఖరారు చేసి, బొగ్గు రవాణాకు రైల్వే రేక్‌ల లభ్యతను గణనీయంగా పెంచాలి. అలాగే, విపత్కర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పవర్ ట్రాన్స్‌మిషన్ చార్జీలను సడలించాలి.
