రైతులందరిదీ ఇదే గోస

రైతులందరిదీ ఇదే గోస
  • వరి వద్దంటే ఎట్ల బతకాలని బోగడ భూపతిపూర్​ వాసుల ఆవేదన
  •  వానాకాలంలో లాస్​ వచ్చినా.. యాసంగిలో మిగులుబాటు ఉంటది
  • సర్కారు తీరుతోనే రవి కుమార్ ​ప్రాణం తీసుకున్నడు
  • వరి వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని వినతి

మెదక్, వెలుగు: యాసంగిలో వరి వేయొద్దన్నందుకే రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని మెదక్​ జిల్లా బోగడ భూపతిపూర్​ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. తమది కూడా రవి లాంటి పరిస్థితే అని, తమ పొలాల్లో వరి తప్ప వేరే  పంట పండదని, ఇప్పుడు ఆ పంటనే వేయొద్దంటే ఎట్లా బతకాలని గోసపడుతున్నరు. వానాకాలంలో పంట లాస్​ వచ్చి అప్పులు మీదపడ్డాయని, యాసంగిలో వరి వేస్తెనన్నా ఎంతో కొంత ఆసరా ఉంటదని చెప్తున్నరు. ‘‘వానాకాలంలో సన్న వడ్లు సాగు చేసినం. దిగుబడి తక్కువ వచ్చింది. లాగోడి పోను ఏమీ మిగల్లేదు. ఈ త్యాప అందరం లాసే అయినం. ఎక్కువ తక్కువగా అందరికీ అప్పులే ఉన్నయ్​. ఇంట్లోళ్లందరం కష్టపడి పంట పండిస్తే, లాభం ఏమీ మిగలకపాయె. అప్పులు ఎట్ల కట్టన్నో సమజైతలేదు. మావి వందురు పొలాలు... వాటిలో వరి మాత్రమే పండుతుంది. సర్కారోళ్లేమో యాసంగిల వరి వేయిద్దంటున్నరు. అట్లయితే మాకు దిక్కేంది?” అని గ్రామ రైతులు వాపోతున్నరు. సర్కార్ వరి సాగు వద్దనడంతో గ్రామానికి చెందిన కరణం రవి కుమార్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఊర్లె ఏ రైతును పలకరించినా, తమ పరిస్థితి కూడా రవి లెక్కనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

దిగుబడి రాక నష్టాలు.. 

గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు 350 నుంచి 400 మంది రైతులు ఉండగా, దాదాపు 250 నుంచి 300 ఎకరాల భూమి ఉంది.  ఎక్కువ శాతం వందురు పొలాలే కావడంతో రైతులందరూ వానాకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ వరినే సాగు చేస్తారు. ఈసారి వానాకాలంలో సగం మంది రైతులు సన్న వడ్లు వేశారు. అయితే దిగుబడి తక్కువ రావడంతో చాలామంది నష్టపోయారు. యాసంగిలోనైనా మంచిగా పండితే కష్టాలు తీరుతాయని అనుకుంటే, సర్కార్ వరి సాగు చేయొద్దని చెప్పింది. దీంతో అప్పులెట్ల తీర్చాలని ఆందోళన పడుతున్నారు.  


సన్నొడ్లకు 200 ఎక్కువిస్తమని ఇయ్యలే...  

వానాకాలంలో ఐదెకరాల్లో సన్న వడ్లు సాగు చేసిన. 36 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. క్వింటాల్ కు రూ.1,960 లెక్క ఇచ్చిన్రు. సన్న వడ్లకు క్వింటాలుకు 200 ఎక్కువిస్తమని ఇయ్యలేదు. వడ్లమ్మితే వచ్చిన పైసలు పెట్టుబడికే సరిపోయినయి.  - మంద నర్సింలు,   రైతు, బోగడ భూపతిపూర్