సీఎస్ఆర్ టార్గెట్ 2,500 కోట్లు!...ప్రత్యేక పాలసీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

సీఎస్ఆర్ టార్గెట్  2,500 కోట్లు!...ప్రత్యేక పాలసీకి  రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
  • ‘తెలంగాణ సీఎస్ఆర్’ పేరుతో 
  • అటానమస్ సంస్థ ఏర్పాటుకు యోచన
  •     త్వరలోనే రాష్ట్రంలోని
  •     పారిశ్రామికవేత్తలతో సమావేశం
  •     గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా పాలసీలపై కొనసాగుతున్న స్టడీ 
  •     ఏటా సగటున ఖర్చు చేస్తోంది రూ.700 కోట్లే
  •     జాతీయ స్థాయిలో వాటా 3 శాతమే.. దీనిని 10 శాతానికి పెంచేలా ప్రపోజల్స్​

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు లెక్కా పత్రం లేకుండా సాగుతున్న సీఎస్ఆర్ వ్యయాన్ని క్రమబద్ధీకరించడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 'తెలంగాణ సీఎస్ఆర్' పేరుతో ఒక ప్రత్యేక స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కంపెనీల ద్వారా ఏటా సగటున రూ. 700 నుంచి 800  కోట్లు మాత్రమే సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేస్తున్నారు. 

అయితే రాష్ట్రంలోని పారిశ్రామిక సామర్థ్యాన్ని బట్టి ఈ మొత్తం చాలా తక్కువని భావిస్తున్న సర్కార్.. దీనిని ఏకంగా రూ. 2,500 కోట్లకు పెంచాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగా ఒక సమగ్రమైన నూతన పాలసీని రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఐటీ, ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లోని దిగ్గజ కంపెనీలను సీఎస్ఆర్​లో భాగస్వాములను చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ఉన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఖర్చవుతున్న మొత్తం సీఎస్ఆర్ నిధుల్లో తెలంగాణ వాటా కేవలం 3 శాతంగానే ఉంది. 

ఈ జాతీయ స్థాయి వాటాను కనీసం10 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. కంపెనీలు తమ నిధులను విడివిడిగా ఖర్చు చేయడం కాకుండా, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఖర్చు చేసేలా చూడడం ద్వారా ఆశించిన ఫలితాలు రాబట్టవచ్చని ప్లాన్ చేస్తోంది. దీంతో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తేవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త సంస్థ ఏర్పాటుతో నిధుల సేకరణలో మరింత పారదర్శకత పెరగడమే కాకుండా, క్షేత్రస్థాయిలో నిధుల వినియోగంపై స్పష్టమైన పర్యవేక్షణ ఉంటుందని చెప్తున్నారు. 

ఫండ్స్ పెంచుకునేలా ప్లాన్​ 

ఈ నూతన విధానాన్ని రూపొందించే క్రమంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను సర్కార్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో సీఎస్ఆర్ నిధుల కోసం ప్రత్యేక పాలసీలు, స్వతంత్ర సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కంపెనీలు ప్రభుత్వ ప్రాజెక్టులతో ఎలా మమేకమవుతున్నాయి, పారదర్శకతను ఎలా పాటిస్తున్నారు అనే అంశాలపై అధికారులు  అధ్యయనం చేస్తున్నారు. 

అక్కడ సత్ఫలితాలనిస్తున్న అంశాలను మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి, ఒక పక్కా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. కేవలం నిధుల సేకరణే కాకుండా, కంపెనీలకు సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంపై కూడా దృష్టి సారించనున్నారు. త్వరలోనే ఈ విధానానికి తుది రూపునిచ్చి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సెక్రటేరియెట్ వర్గాలు వెల్లడించాయి.

సర్కారుకు ఆర్థిక వెసులుబాటు 

అటానమస్ సంస్థ ఏర్పాటుతో నిర్ణయాల ప్రక్రియలో జాప్యం ఉండదని, నిధుల వినియోగంపై కార్పొరేట్ సంస్థలకు పూర్తి స్థాయి భరోసా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏటా రూ. 2,500 కోట్ల నిధులు సమీకరించగలిగితే, బడ్జెట్‌పై భారం తగ్గడమే కాకుండా ప్రభుత్వ ప్రాధాన్య రంగాలకు భారీగా ఆర్థిక వెసులుబాటు లభిస్తుందంటున్నారు. పారిశ్రామికవేత్తలతో త్వరలో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, వారి సూచనలు, సలహాలను కూడా ఈ పాలసీలో చేర్చాలని యోచిస్తున్నారు. 

ప్రస్తుతం వస్తున్న సీఎస్ఆర్ నిధులు కూడా ప్రధానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగైదు  జిల్లాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీలను సమన్వయం చేసి, వెనుకబడిన జిల్లాలపై దృష్టి పెడితే ఈ నిధులను రూ. 2,500 కోట్లకు చేర్చవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.