ఆదాయం డబుల్..అప్పులతోనే ట్రబుల్

ఆదాయం డబుల్..అప్పులతోనే ట్రబుల్

హైదరాబాద్, వెలుగుతెలంగాణ అవతరించిన వెంటనే మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఉమ్మడి ఏపీలో ఉన్న ఆదాయం మొత్తం ఒక్క తెలంగాణలోనే సాధ్యమవుతుందని నిరూపించింది. తొలి రెండేళ్లు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా  దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించిన రాష్ట్రం.. క్రమంగా హద్దులు దాటింది. అభివృద్ధి పనుల పేరుతో భారీ మొత్తంలో అప్పులు తెచ్చేందుకు పోటీ పడింది. దీంతో ఆర్థిక నిర్వహణ గాడి తప్పింది. ఆర్థిక మాంద్యం సెగ తగిలిన వెంటనే ఖజానా డొల్లతనం బయటపడిపోయింది.

అప్పులపై తప్పిన కంట్రోల్

తొలి ఏడాది రూ. లక్ష కోట్లతో బడ్జెట్​ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆరేళ్లు తిరిగేసరికి ఇంచుమించుగా బడ్జెట్ సైజ్ ను డబుల్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.82 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ప్రజలపై భారీ పన్నులను మోపకుండానే ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు అవస్థలు పడింది. ప్రధానంగా లిక్కర్​ రేట్లను డబుల్​ చేసింది. పెట్రోల్ పై వ్యాట్​ను వడ్డించింది. ప్రజలకు నేరుగా ఎఫెక్ట్ ఇచ్చే ఆర్టీసీ బస్సులు, విద్యుత్ చార్జీలను పెంచక తప్పని పరిస్థితిని సృష్టించింది. ఆర్టీసీ సమ్మెకు పరిష్కారంగా ప్రజలపై చార్జీల భారం మోపింది. కరోనా ఎఫెక్ట్​తో లిక్కర్​ రేట్లను ఒక్కసారిగా పెంచేసింది. ఎన్నికల టైమ్ లో రాష్ట్ర బడ్జెట్​ను మించి హామీలివ్వటం ఖజానాకు చేటు తెచ్చిందనే విమర్శలున్నాయి. నిధుల కొరత కారణంగానే దళితులకు మూడెకరాల భూమి, డబుల్​బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, రెండో విడత రుణ మాఫీ, రైతు బంధు పథకాల అమలుకు ఆపసోపాలు పడుతోందనే అభిప్రాయాలున్నాయి. అప్పులనియంత్రణ, ఉన్న వాస్తవిక ఆదాయంలో సంక్షేమం, అభివృద్ధి పనులను సర్దుబాటు చేసుకోవటంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రతినెలా రూ.3 వేల కోట్ల కిస్తులు 

ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ పంచుకున్న అప్పు రూ. 70 వేల కోట్లు. ఆరేండ్లలో ఈ అప్పుల కుప్ప నాలుగున్నర రెట్లు పెరిగిపోయింది. దాదాపు రూ.3.18 లక్షల కోట్లు అప్పులున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఏడాదికి రూ.37 వేల కోట్లు.. అప్పులు, వడ్డీల కిస్తులకే  చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో పెద్ద వాటా అప్పులోళ్లకే సరిపోతోంది. మిగిలిన ఆదాయంలో ఉద్యోగుల జీతాలకు పెద్దమొత్తం చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఏటా ప్రభుత్వం కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా విపత్తు ఖజనాను మరింత దివాళా తీయించింది. ఉద్యోగులకు వరుసగా 2 నెలల జీతాలకు సర్కారు కోత పెట్టింది. అప్పులు, వడ్డీల కిస్తుల చెల్లింపులను వాయిదా వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం కూడా రాష్ట్ర ఖజానా వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.

ఫండ్స్ అన్నీ ప్రాజెక్టులకే

ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటి రంగానికి  ప్రయారిటీ ఇచ్చింది. ఆరోగ్యం, ఉన్నత విద్య రంగాలు అట్టడుగున పడ్డాయి. సంక్షేమం పేరిట నేరుగా లబ్ధిదారులకు కానుకలు, నగదు పంపిణీకి ప్రాధాన్యమివ్వటం బడ్జెట్​కు షాక్​ఇచ్చింది. ఒక ఏడాది రాష్ట్ర బడ్జెట్​కు సరిపడే నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకే మళ్లించింది. తొలి రెండేళ్లు మిషన్ భగీరథ, మిషన్​ కాకతీయ పథకాలకు నిధులిచ్చింది.  ఖజానాకు నికరంగా వచ్చే రాబడి అందుకు సరిపోదని భావించిన సర్కారు కొత్త  కార్పొరేషన్లు పెట్టి, వాటి పేరిట అప్పులు తేవడం మొదలుపెట్టింది.  కార్పొరేషన్ల పేరుతో ఇప్పటికే రూ.89 వేల కోట్లకుపైగా  అప్పులు తెచ్చింది. దీంతో బడ్జెట్​లో అప్పులు చూపించకుండా దాచటంతో పాటు ఎఫ్ఆర్ బీఎం చట్టాన్ని ఉల్లంఘించినట్లు అయింది. ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్​ ప్రాజెక్టులపైనే రూ.1.06 లక్షల కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు భారీగా నిధులు వెచ్చించాల్సి రావటంతో ఎఫెక్ట్‌పడింది.