ఎరువుల వాడకంలో మన రాష్ట్రమే ఫస్ట్

ఎరువుల వాడకంలో మన రాష్ట్రమే ఫస్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతున్నారు. పంట పొలాల్లో మోతాదుకు మించి రసాయన ఎరువులను చల్లుతుండడంతో భూములు సారాన్ని కోల్పోతున్నాయి. విచ్చలవిడిగా ఎరువుల వాడకంతో మొదట్లో పంట దిగుబడి పెరిగినా, క్రమక్రమంగా పంటల్లో రసాయనాల అవశేషాలు పెరిగిపోవడంతో పాటు పొలాలు కూడా కలుషితమవుతున్నాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో హెక్టార్ కు సగటున 245.29 కిలోల ఎన్పీకే (నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం) వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఒకట్రెండు స్థానాల్లో ఉన్న పంజాబ్, హర్యానాలో ఎరువుల వినియోగం కొంత తగ్గగా, మన రాష్ట్రంలో పెరగడం గమనార్హం. మన తర్వాత స్థానాల్లో బీహార్ ( 227.30 కిలోలు), పంజాబ్ (224.49 కిలోలు), హర్యానా (224.46 కిలోలు) ఉన్నట్లు సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన రిపోర్టులో వెల్లడైంది.

మోతాదుకు మించిన ఫాస్పరస్..

రాష్ట్రంలో హెక్టార్ కు సగటున 161 కిలోల యూరియా, 62.50 కిలోల ఫాస్పరస్, 20.87 కిలోల పొటాషియం వినియోగిస్తున్నారు. ఫాస్పరస్ సింగిల్- సూపర్ ఫాస్పేట్, డై- అమ్మోనియం- ఫాస్పేట్(డీఏపీ)గా వాడుకలో ఉంది. అయితే రాష్ట్రంలోని నేలల్లో ఇప్పటికే మోతాదుకు మించి ఫాస్పరస్ ఉన్నట్లు ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు నిర్వహించిన భూసార పరీక్షల్లో తేలింది. ఫాస్పరస్ ఎక్కువగా ఉన్న నేలల్లో పెరిగే మొక్కలు జింక్, గంధకం, బోరాన్ తదితర సూక్ష్మ పోషకాలను తీసుకోలేవని, డీఏపీని పంట కాలంలో ఒకసారి కాకుండా రెండుసార్లు వేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఏఆర్ఐ) ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ సురేంద్రబాబు వెల్లడించారు. దీన్ని తగ్గించి పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడాలని సూచించారు.

సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించాలన్న కేంద్రం

మన దేశంలో హరిత విప్లవం నుంచి ఎరువుల వినియోగం బాగా పెరిగింది. దీంతో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలో ఈ ఎరువులను అందిస్తోంది. గత పదేళ్లుగా ఏటా సగటున 5 కోట్ల మెట్రిక్ టన్నుల ఎరువులను సబ్సిడీపై సరఫరా చేస్తోంది. అయితే అవసరానికి మించి ఎరువులు, పురుగు మందుల వాడకంతో భూసారం, ఆహారం కలుషితం అవుతోంది. దీంతో కెమికల్ ఫర్టిలైజర్స్ వినియోగం తగ్గించాలని, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. అందుకే ప్రతి రైతు భూమికి సాయిల్ టెస్టులు చేయించి, ఏయే పోషకాలు అవసరమో గుర్తించి, అవే ఎరువులు వాడాలని సూచించింది. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను పోయినేడాదే ఆదేశించింది.