ఎత్తైన కొండలు ...వాటిపై నుంచి జాలు వారే నీళ్లు.. హైదరాబాద్కు అతిదగ్గరలో జలపాతాలు..

ఎత్తైన కొండలు ...వాటిపై నుంచి జాలు వారే నీళ్లు.. హైదరాబాద్కు అతిదగ్గరలో జలపాతాలు..

జలపాతం..  ప్రకృతి ఇచ్చిన అందమైన ప్రపంచం.  అందమైన ప్రకృతి దృశ్యాలు..మనసు మైమరిచిపోయే  జలపాతాలు...చుట్టూ ఎత్తైన కొండలు ...వాటి పై నుంచి జాలు వారే నీళ్లు..ఇలాంటివి ఎక్కడుంటాయి. ఏ అమెరికాలోనూ..లేదా ఆస్ట్రేలియాలోనో..లేదంటే భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటాయని అనుకుంటారు. కానీ అందమైన ప్రకృతి దృశ్యాలను  వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలోనే..మనకు అతి దగ్గరలోనే ఆకట్టుకునే..అద్భుతం అనిపించే జలపాతాలు ఉన్నాయి. తెలంగాణాలో  ప్రసిద్ధి చెందిన జలపాతాలు..అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.


సప్తగుండాల జలపాతం

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో  సప్తగుండాల జలపాతం ఓ అద్భుతమైన ప్రకృతి దృశ్యం. ఇక్కడ  ఒకటి కాదు ఏడు జలపాతాలు ఉన్నాయి.  ఓ వైపు ఎత్తైన కొండలు.. మరోవైపు దట్టమైన అడవులు.. ఇది ఏడు అంచెల క్యాస్కేడ్‌లతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. సప్తగుండాల జలపాతం  కొమరంభీం జిల్లా లింగాపూర్ మండలంలోని పిట్టగూడకు 2 కి. మీ దూరంలో అడవుల్లోని అడవీ ప్రాంతంలో ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి 3 కి.మీ దూరం వరకు కఠినమైన, ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతంలో నడవాల్సి ఉంటుంది. ఈ ఏడు జలపాతాలలో ముఖ్యమైనవి పెద్ద జలపాతం. ఇక్కడ అంత ఎత్తునుంచి నీరు పడుతుంటే.. భారీ పాలధారలు..ఆకాశంనుంచి కిందకు పడుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఎలా చేరుకోవాలి

ఆసిఫాబాద్‌ బస్ డిపో నుంచి మెట్ట జలపాతంకి వెళ్ళాలంటే లింగాపూర్ లోని మానిక్ గూడెం రోడ్డుమార్గం ద్వారా వెళ్ళి, అక్కడి నుండి కాలి నడక ద్వారా వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి ఈ జలపాతం 260 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 

కుంటాల జలపాతం

కుంటాల జలపాతాలు 200 అడుగుల ఎత్తుతో  రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతాల్లో ఒకటిగా ప్రసిద్ది చెందాయి.  కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడికొండ గ్రామ సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణి మధ్యలో ఉంది. ఇది కడెం నది ప్రవాహం ద్వారా ఏర్పడింది. ఇది రాతి వేదిక నుండి రెండు మెట్ల గుండా ప్రవహిస్తుంది. కుంట అనే పదాన్ని తెలుగులో చెరువు అంటారు. అందుకే ఈ జలపాతానికి ఆ పేరు వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ జలపాతానికి దగ్గరలో గాయత్రీ జలపాతం కూడా ఉంది.

ఎలా చేరుకోవాలి

కుంటాల జలపాతాలు హైదరాబాద్ నుండి 261 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కుంటాల జలపాతం ఆదిలాబాద్ నుండి 58 కిమీ...నిర్మల్ నుండి 43 కిమీ.. నేరేడికొండ  గ్రామానికి 12 కిమీ దూరంలో ఉంది.

బొగత జలపాతం

ములుగు జిల్లాలో చీకుపల్లి వాగుపై బోగత జలపాతాలున్నాయి. దట్టమైన పచ్చని అడవుల మధ్య.. కొండకోనల నుంచి జాలువారే నీటి హొయలను చూస్తే అదుర్స్ అనిపిస్తుంది.  కొండల పైనుంచి ఉధృతంగా జాలువారుతోన్న నీటి ప్రవాహం కనువిందు చేస్తోంది. జలపాతానికి సమీపంలో బోగటేశ్వర స్వామి అనే ఆలయం కూడా ఉంది.

ఎలా చేరుకోవాలి

బొగత జలపాతాలు  ములుగు నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.  వరంగల్ నుండి 140 కి.మీ. హైదరాబాద్ నుండి 329 కి.మీ దూరంలో ఈ జలపాతాలున్నాయి. 

మల్లెల తీర్థం జలపాతాలు

నల్లమల్ల అడవిలోని ప్రసిద్ధ జలపాతాలలో మల్లెల తీర్థం ఒకటి. 150 అడుగుల నుండి.. ఎత్తైన దట్టమైన అడవిలో నీరు నేరుగా రాళ్ళపై పడటాన్ని ప్రత్యక్షంగా వీక్షించాల్సిందే. మల్లెల తీర్థం జలపాతాల మూలం నల్లమల్ల అడవిలో కృషా నదిపై ఉంది. రోడ్డు నుంచి జలపాతం వరకు నడవాల్సిందే.  సుమారు 400 మెట్లపై వెళ్లాల్సిందే. ఈ మల్లెల తీర్థంలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని మోక్షం దొరుకుతుందని ఒక నమ్మకం.

ఎలా చేరుకోవాలి

మల్లెల తీర్థం జలపాతాలు హైదరాబాద్ కు 173 కిలో మీటర్లు... శ్రీశైలం క్షేత్రానికి 58 కిమీ దూరంలో ఉన్నాయి.  శ్రీశైలం నుండి 50 కిలో మీటర్లు  వెళ్ళిన తర్వాత.. వట్వర్లపల్లి గ్రామం వద్ద కుడి మలుపు తీసుకొని,..అక్కడి నుంచి మరో 8 కిలో మీటర్లు వెళ్లాలి. 
వట్వార్లపల్లి నుండి స్థానిక రవాణా కూడా అందుబాటులో ఉంది.

పోచెర జలపాతాలు

తెలంగాణలో లోతైన జలపాతాల్లో పోచెర జలపాతాలు ఒకటి.   ఈ జలపాతాల  చుట్టూ సుందరమైన ప్రదేశాలు..అహ్లాదపరిచే పచ్చటి వాతావరణం ఉంటుంది. మనోహరమైన ఈ  జలపాతం సాహసికులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుంది.  జలపాతం చుట్టూ ఉన్న ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.  పోచెరా జలపాతాలను ప్లంజ్ వాటర్‌ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ప్రాథమికంగా గోదావరి సహయాద్రి పర్వతాన్ని కలుస్తుంది.  వివిధ నీటి వనరులు ఏర్పడతాయి. పొచ్చెర జలపాతాల సరఫరా కోసం నీటి వనరులలో ఒకటి వాటి నుండి తప్పించుకుంటుంది. ఈ జలపాతాలకు సమీపంలో నర్సింహ స్వామి ఆలయం ఉంది.

ఎలా చేరుకోవాలి

పోచెర జలపాతాలు హైదరాబాద్ నుండి సుమారు 280 కి.మీ దూరంలో ఉన్నాయి.  నిర్మల్ జిల్లా పట్టణానికి 37 కి.మీ ఉన్నాయి.  ఆదిలాబాద్ పట్టణానికి 47 కి.మీ దూరంలో ఉన్నాయి.