- రెండు రాష్ట్రాల సమన్వయంతో ఎన్నారైల సంక్షేమ చర్యలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఎన్నారై విధివిధానాల రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించింది. కమిటీ చైర్మన్ బీఎమ్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి నాయకత్వంలోని ఈ బృందం.. ఏపీ ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్‌ఆర్‌టీ ప్రభుత్వ సలహాదారు వేమూరు విజయ్ కుమార్, సీఈఓ కృష్ణ మోహన్‌లతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రవాసుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి. ఈ సమీక్షలో ఏపీ ప్రభుత్వం ఎన్నారైల సంక్షేమం కోసం ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న విధివిధానాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలంగాణ కమిటీకి వివరించారు. ఎన్నారైల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే విధివిధానాల రూపకల్పనలో ఏపీ ప్రభుత్వం, తమ మంత్రిత్వ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం కమిటీ సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. నిర్మాణ దశలో ఏపీ ఎన్‌ఆర్‌టీ టవర్ నిర్మాణం త్వరలోనే పూర్తి అవుతుందని చెప్పారు. దాని ద్వారా దాదాపు 5 నుంచి 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా 50 లక్షల మంది వలసదారులున్నారని మంత్రి గుర్తుచేశారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభత్వం ఎన్నారై కొత్త పాలసీని రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వివిధ రాష్ట్రాల పర్యటనలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
