ఎన్నికలకు పోలీస్​ ఫోకస్..వచ్చే నెల నుంచే కార్యాచరణ

ఎన్నికలకు పోలీస్​ ఫోకస్..వచ్చే నెల నుంచే కార్యాచరణ
  •     వచ్చే నెల నుంచే కార్యాచరణ
  •     బందోబస్తు, బలగాల తరలింపుపై చర్చ
  •     కర్నాటక ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులతో డీజీపీ భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఐదు నెలల్లో జరగనున్న ఎన్నికలకు పోలీసు శాఖ కసరత్తు ప్రారంభించింది. జూన్‌‌‌‌  నుంచి కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఫలితాలు వచ్చే వరకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో లా అండ్‌‌‌‌ ఆర్డర్, భద్రతా పరిశీలకులుగా విధులు నిర్వహించిన అదనపు డీజీ సౌమ్యా మిశ్రా, పోలీస్  అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్‌‌‌‌  కుమార్, రాచకొండ ట్రాఫిక్  డీసీపీ అభిషేక్  మొహంతితో డీజీపీ అంజనీ కుమార్‌‌‌‌‌‌‌‌ సోమవారం సమావేశం నిర్వహించారు. సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో చర్చించారు. కర్నాటకలో నిర్వహించిన ఎన్నికల నిర్వహణ వివరాలను పరిశీలకులు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌‌‌‌ ఇచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సరికొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయన్నారు. జూన్, జులైలోనే ఎన్నికలకు సంబంధించిన బందోబస్తు, కేంద్ర, రాష్ట్ర బలగాల తరలింపు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల విషయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇంటెలిజెన్స్ అడిషనల్  డీజీ అనిల్  కుమార్ మాట్లాడుతూ ఒకే ప్రాంతంలో మూడేళ్లుగా పనిచేస్తున్న ప్రతి పోలీసు అధికారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉందని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్  కేంద్రాల గుర్తింపు, సరిహద్దు ప్రాంతాల చెక్‌‌‌‌పోస్టుల ఏర్పాటుపై స్పెషల్‌‌‌‌ ఫోకస్  పెట్టాలని అదనపు డీజీ సంజయ్‌‌‌‌  కుమార్  జైన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐడీ చీఫ్‌‌‌‌  మహేష్  భగవత్, పోలీస్ బెటాలియన్ల అదనపు డీజీ స్వాతి లక్రా, అడిషనల్ డీజీ విజయ్‌‌‌‌ కుమార్ పాల్గొన్నారు.