ధిదివ్యాంగులకు లింకేజీతో స్వయం ఉపా..2,500 సంఘాలకు అందిన రుణాలు!

ధిదివ్యాంగులకు లింకేజీతో స్వయం ఉపా..2,500 సంఘాలకు అందిన రుణాలు!
  • రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది దివ్యాంగ సభ్యుల పొదుపు బాట
  • ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియా.. తీసుకున్న అప్పు కూడా మాఫీ
  • నాబార్డ్ నిబంధనల ప్రకారం 60 ఏండ్లలోపు వారికే అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దివ్యాంగుల ఆర్థికాభివృద్ధితోపాటు వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి, వాటిని బ్యాంకులతో అనుసంధానం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 12,930 దివ్యాంగుల సంఘాలు ఏర్పాటయ్యాయి. సుమారు 80 వేల మంది దివ్యాంగులు ఈ సంఘాల్లో సభ్యులుగా చేరి పొదుపు బాట పట్టారు.

మొదటి విడత కింద సుమారు 2,500 సంఘాలకు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశారు. ఈ సంఘాల పరిధిలో నల్గొండ జిల్లాలో 30 వేలు, ఖమ్మం జిల్లాలో 27 వేలు, రంగారెడ్డి జిల్లాలో 26 వేల మంది సభ్యులు దివ్యాంగుల సంఘాల్లో చేరారు. ఒక్కో సంఘంలో ఐదుగురు సభ్యులకు అవకాశం కల్పించారు. గతంలో 65 ఏళ్లు ఉన్నా సంఘాల్లో చేర్చుకుని ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చేది.

కానీ, ప్రస్తుతం నాబార్డ్ నిబంధనల ప్రకారం.. 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారికే అవకాశం ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన వేల సంఖ్యలోని ఈ సంఘాల సభ్యులంతా క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. వీరికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా సొంతంగా చిన్నపాటి వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

దివ్యాంగుల కుటుంబాల్లో వెలుగు

దివ్యాంగుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం మరో భారీ భరోసాను కల్పిస్తోంది.  బ్యాంకు లింకేజీ ద్వారా అందే రుణాలతో దివ్యాంగులు కిరాణా షాపులు, జిరాక్స్ సెంటర్లు, టైలరింగ్, హస్తకళల వంటి పనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణలో ఈ రుణాల పంపిణీ పారదర్శకంగా జరగనుంది. బ్యాంకు లింకేజీ రుణం పొందిన సభ్యుల్లో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియా అందించాలని నిర్ణయించింది.

కేవలం ఈ ఆర్థిక సాయమే కాకుండా, సదరు సభ్యుడు తీసుకున్న రుణాన్ని కూడా పూర్తిగా మాఫీ చేయనున్నారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం దివ్యాంగుల కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోంది. అప్పుల బాధ లేకుండా, ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడనుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారంతో దివ్యాంగులు ఇకపై ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో ముందుకెళ్లే అవకాశం లభించనుంది