ఇయ్యాలే పోలింగ్ .. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా..

ఇయ్యాలే పోలింగ్ .. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా..
  • మావోయిస్టుల ప్రభావముండే 13 సెగ్మెంట్లలో 4 గంటల వరకే
  • ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది  
  • అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్
  • ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు అంతా రెడీ అయింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఈవీఎంలు, వీవీప్యాట్స్, ఇంక్, ఓటరు లిస్టు తదితర ఎన్నికల సామగ్రి తీసుకుని సిబ్బంది బుధవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 

 ఈవీఎంలను అన్ని రకాలుగా చెకింగ్​ చేసిన తర్వాత 75,464 బ్యాలెట్​యూనిట్లు, 44,828 కంట్రోల్​యూనిట్లు, 49,460 వీవీప్యాట్లు పోలింగ్ కోసం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేసింది. దాదాపు 12 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి, ఆయా చోట్ల మూడంచెల భద్రత కల్పించింది. ఈ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలతోనూ నిఘా పెట్టింది. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించమని స్పష్టం చేసింది. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని, అందరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు వేయాలని కోరారు. 

పోలింగ్, బందోబస్తు విధుల్లో 3 లక్షల మంది.. 

ఈసారి ఎన్నికల విధుల్లో 2 లక్షల 433 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 12వేల 909 మంది మైక్రో అబ్జర్వర్లు, 3వేల 803 మంది సెక్టార్ ఆఫీసర్లు, 1,251 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 4,039 మంది రూట్ ఆఫీసర్లు, 184 మంది అసిస్టెంట్ ఎక్స్ పెండిచర్ అబ్జర్వర్స్, 234 మంది మానిటరింగ్ ఆఫీసర్లు ఉన్నారు. 1,316 ఎస్ఎస్ టీ, 640 వీడియో సర్వైలెన్స్ టీమ్స్ ఉన్నాయి. ప్రీసైడింగ్ ఆఫీసర్లు 4,317 మంది, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బంది లక్షా 32 వేల 596 మంది ఉన్నారు.

ఇక ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. బందోబస్తు విధుల్లో 45 వేల మంది రాష్ట్ర పోలీసులతో పాటు కర్నాటక, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, చత్తీస్ గఢ్ నుంచి వచ్చిన 23,500 మంది సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు 375 కేంద్ర కంపెనీల బలగాలు, టీఎస్‌ఎస్‌పీకి చెందిన 50 కంపెనీల బలగాలు, ఎక్సైజ్, ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ల నుంచి 3 వేల మంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. మొత్తంగా దాదాపు లక్ష మంది వరకు భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు. 

ఎల్బీనగర్​లో అత్యధికంగా 48 మంది పోటీ..  

రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా.. వివిధ పార్టీల, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి 2,290 మంది బరిలో ఉన్నారు. వీరిలో 2,068 మంది పురుషులు కాగా, 221 మంది మహిళా అ‌భ్యర్థులు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు. అత్యధికంగా ఎల్బీనగర్ లో 48 మంది పోటీలో ఉంటే.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఈ పార్టీ నుంచి 8 మంది మహిళలు బరిలో ఉన్నారు.

కాంగ్రెస్ 118 స్థానాల్లో పోటీ చేస్తుండగా, 12 మంది మహిళలు..  బీజేపీ 111 స్థానాల్లో పోటీలో ఉండగా, 13 మంది మహి‌‍ళలు బరిలో ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుండగా, వీరిలో ఒక మహి‌ళా అభ్యర్థి ఉన్నారు. అభ్యర్థుల్లో 31 నుంచి 40 ఏండ్ల వయసున్న వారే ఎక్కువ మంది. 25–-30 ఏండ్లు ఉన్నోళ్లు 240 మంది.. 31-–40 ఏండ్లు ఉన్నోళ్లు 787.. 41–-50 ఏండ్లు ఉన్నోళ్లు 628.. 51-–60 ఏండ్లు ఉన్నోళ్లు 434 మంది.. 61–-70 ఏండ్లు ఉన్నోళ్లు 171 మంది.. 71-–80 ఏండ్లు ఉన్నోళ్లు 29 మంది ఉన్నారు. కాగా, 2018 ఎన్నికల్లో 1,777 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 

మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు..  

మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వుమెన్ పోలింగ్ స్టేషన్లు నియోజకవర్గానికి ఐదు చొప్పున 595.. మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున 595 ఏర్పాటు చేశారు. అలాగే దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక స్పెషల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు కోరితే పోలింగ్ కేంద్రం వరకు రవాణా సదుపాయం కూడా కల్పిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో 21,686 వీల్ చైర్స్ అందుబాటులో ఉంచారు. వృద్ధులు, దివ్యాంగులకు సాయం చేసేందుకు వలంటీర్లను కూడా నియమించారు. అంధుల కోసం బ్రెయిల్ లిపిలో పోస్టల్ బ్యాలెట్, పోస్టర్స్ అందుబాటులో ఉంచారు. వినికిడి లోపం ఉన్న వారికి కూడా పోస్టర్లు తయారు చేశారు. వారితో మాట్లాడే విధంగా పోలింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. 

లిస్టులో పేరుంటే చాలు.. 

ఓటరు జాబితాలో పేరు ఉండి, ఓటరు కార్డు లేనివారు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయొచ్చు. ఓటరు గుర్తింపు నిర్ధారణ సమయంలో క్లరికల్, స్పెల్లింగ్ తప్పుల వంటి వాటిని పోలింగ్ అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. మరొక అసెంబ్లీ నియోజకవర్గ రిజిస్ట్రేషన్ ఆఫీ సర్ జారీ చేసిన ఎపిక్ కార్డును ఓటరు చూపితే, ఆ ఓటరు పేరు పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఉన్నట్లయితే, దాన్ని గుర్తింపు కోసం అనుమతించవచ్చని తెలిపింది.

ఫొటో ఉన్న ఓటరు స్లిప్పు, ఓటర్ ఐడీ, ఆధార్‌ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థల గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి), పాన్‌కార్డు, జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌కార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పేపర్లు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు పేపర్లలో ఏదైనా చూపించొచ్చు. 

యువత, మహిళల ఓట్లే కీలకం.. 

రాష్ట్రంలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 1,63,13,268 మంది పురుషులు కాగా.. 1,63,02,261 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 2,676 మంది థర్డ్ జెండర్. ఇక కొత్తగా ఓటు హక్కు పొందినోళ్లు 9,99,667 ఉండగా.. 80 ఏండ్లు పైబడిన ఓటర్లు 4,40,371 మంది. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7,32,506 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 1,48,713 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఈసారి ఎన్నికల్లో యువత ఓటింగ్ కీలకంగా మారనుంది. యువత, మహిళలు ఎటువైపు మొగ్గు చూపితే.. ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

పోలింగ్​ పెంచేందుకు ఈసీ చర్యలు.. 

ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అర్బన్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఓటర్లకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే ఓటు వేస్తారో తెలుసుకుని.. దానికి తగిన విధంగా యాప్ కూడా తయారు చేసింది. దీని ద్వారా పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూలైన్ ఉందో చూడొచ్చు. ఓటు వేయా లంటే ఎంత సమయం పడుతుందో తెలుసుకో వచ్చు. పోలింగ్ కేంద్రాల్లో పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. కాగా, 2018 ఎన్నికల్లో 73.20 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ సమ యంలో గ్రామీణ ఓటింగ్‌ ఎక్కువగా నమోదైంది. అర్బన్‌ ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 

మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలివే.. 

మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో సాయం త్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం ఉన్నాయి. ఈ సెగ్మెంట్లలో దాదాపు 600 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.