- 5 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైనే రికార్డు
- సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
హైదరాబాద్, వెలుగు:భానుడి దెబ్బకు రాష్ట్రమంతా సలసలా కాలిపోతున్నది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలోని 250 మండలాల్లో హీట్‌వేవ్స్ నమోదయ్యాయి. బయట పనులకోసం వెళ్లే వారు 11 గంటలలోపే బయటకు వచ్చేస్తున్నారు. 12 దాటితే రోడ్లపై జనం పలుచగా కనిపిస్తున్నారు. అత్యవసరమైన పనులకూ బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. ఇటు వాతావరణ శాఖ కూడా మధ్యాహ్నం పూట అనవసరంగా బయటకు వెళ్లొద్దని, వెళ్లినా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోవడంతో పాటు వేడిగాలులు తీవ్రంగా వీచాయి. 25 జిల్లాలు రెడ్‌జోన్‌లోకి వెళ్లాయి. అందులో 20 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే.. మరో 5 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి.
అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలల్లో 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3 ఇంక్లైన్, హనుమకొండ జిల్లా కమలాపూర్, జగిత్యాల జిల్లా నేరెళ్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కరీంనగర్ జిల్లా గంగాధర, ఖమ్మం జిల్లా కల్లూరు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ఇల్లందు క్లబ్, ములుగు జిల్లా వెలుతుర్లపల్లి, నల్గొండ జిల్లా ఈదులూరు, రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారంలలో 46.4 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి.
అలాగే మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లి, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లేపల్లిలలో 46.3 డిగ్రీల చొప్పున, ఆదిలాబాద్ జిల్లా జైనద్, వరంగల్ జిల్లా దుగ్గొండిల్లో 46.2, సిద్దిపేట జిల్లా గండిపల్లిలో 46.1, కామారెడ్డి జిల్లా బిర్కూరులో 45.9, జనగామ జిల్లా మల్కాపూర్‌లో 45.5, మెదక్ జిల్లా శంకరంపేటలో 45.1, నాగర్‌కర్నూల్ జిల్లా బొల్లంపల్లి, రంగారెడ్డి జిల్లా మాడ్గుల్లలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది.
సంగారెడ్డిలో 44.1 డిగ్రీలు
సంగారెడ్డి జిల్లాలో 44.1, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 43.9, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో 43.6, హైదరాబాద్ జిల్లాలో 43.4, జోగుళాంబ గద్వాల జిల్లాలో 43.3, వికారాబాద్ జిల్లాలో 43.1, వనపర్తిలో 42.8, నారాయణపేటలో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డవడం గమనార్హం. హైదరాబాద్ సిటీ పరిధిలోనూ టెంపరేచర్లు సీజన్లో పీక్స్‌కు చేరుకున్నాయి.
44 డిగ్రీలకు చేరువగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. మేడిపల్లిలో అత్యధికంగా 43.9 డిగ్రీలుగా నమోదైంది. కార్వాన్లో 43.6 డిగ్రీలు, అంబర్‌పేటలో 43 డిగ్రీలుగా టెంపరేచర్లురికార్డయ్యాయి. దాదాపు అన్ని సర్కిళ్లలోనూ 42 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండుమూడు రోజులపాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని, ఆ తర్వాత టెంపరేచర్లు కొంచెం తగ్గే అవకాశం ఉందని
వాతావరణ శాఖ వెల్లడించింది.
లారీతో సహా కంటెయినర్లలో 8 కార్లు బుగ్గి ..మెదక్ జిల్లా తూప్రాన్ హైవే 44పై ఘటన
తూప్రాన్, వెలుగు: కార్లను తరలిస్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో లారీతో పాటు కంటెయినర్లలో ఉన్న 8 కొత్త కార్లు కాలిపోయాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారులో నేషనల్ హైవే 44 పై గురువారం జరిగింది. ఓ కార్ల కంపెనీకి చెందిన కార్లను కంటైనర్ లారీలో మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఏపీలోని కాకినాడకు తరలిస్తున్నారు. వెహికల్ తూప్రాన్ వద్దకు రాగానే లారీ ఇంజన్ లో మంటలు చెలరేగాయి.
గమనించిన డ్రైవర్, క్లీనర్ లారీని రోడ్డుపై ఆపేసి దిగిపోయారు. మంటలు వెంటనే కంటైనర్ మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న 8 కార్లు పూర్తిగా కాలిపోయాయి. వాటి విలువ సుమారు రూ.70 లక్షల వరకు ఉంటుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు.
