పైసల నగలు.. బంజారా బిర్యానీ: ఆదిమహోత్సవ్​లో స్పెషల్​ అట్రాక్షన్​గా తెలంగాణ స్టాళ్లు

పైసల నగలు.. బంజారా బిర్యానీ: ఆదిమహోత్సవ్​లో స్పెషల్​ అట్రాక్షన్​గా తెలంగాణ స్టాళ్లు

నాణేలతో చేసిన లంబాడా
ఆభరణాలపై విజిటర్ల ఆసక్తి

న్యూఢిల్లీ, వెలుగు: పైసలతో చేసిన నగలు.. నోరూరించే బిర్యానీ.. స్పెషల్​ ఎర్ర చీమల చట్నీ.. ఔరా అనిపించే చేతి కళలు.. ట్రైబల్​ డ్యాన్సులు.. ఒక్కటేమిటి ఆదిమహోత్సవ్​కు పోతే ఇలాంటివి ఎన్నెన్నో చూడొచ్చు. అయితే, వాటన్నింటినీ కళ్లారా చూడాలంటే మాత్రం ఢిల్లీకి వెళ్లాల్సిందే. ఈనెల 1న ఢిల్లీ హాట్​లో ‘వోకల్​ ఫర్​ లోకల్​’ అనే నినాదంతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘ఆదిమహోత్సవ్​’ను ప్రారంభించారు. గిరిజనుల కళలు, వారి ప్రత్యేకతలను దేశానికి తెలియజెప్పే ఉద్దేశంతో కేంద్ర గిరిజన శాఖ ఏటా ‘ఆది మహోత్సవ్​’ను నిర్వహిస్తోంది. వారి వ్యాపారానికీ ఈ కార్యక్రమం వేదికలా నిలుస్తోంది. అక్కడ తెలంగాణ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రోజూ లక్ష మందికిపైగా అక్కడకు వెళుతున్నారు. తమకు నచ్చిన గిరిజన బొమ్మలు, ఆభరణాలను కొనుక్కుంటున్నారు. చత్తీస్​గఢ్​, ఒడిశా, మణిపూర్​, మధ్యప్రదేశ్, రాజస్థాన్​కు చెందిన ట్రైబల్​ డ్యాన్సులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

తెలంగాణ లంబాడ నగిషీలకు మంచి గిరాకీ

ఆదిమహోత్సవ్​లో ఇండియా నుంచి 500కుపైగా గిరిజన కళాకారులు, వ్యాపారులు పాల్గొంటున్నారు. దాదాపు 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి చెందిన లంబాడ నగిషీలు స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచాయి. ఐదు పైసలు, పావలా, ఆఠాణా, రూపాయి బిళ్లలతో చేసిన లంబాడాల నగలపై మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. హస్​ లీ, టోబ్లీ, గూగ్రీ, వాంక్​ డీ, కాస్ని, ఈ చూవా, గాజుర్​ బంద్​, కసోటియా, బలియా, హేతియా వంటి ప్రత్యేక ఆభరణాలు తెలంగాణ స్టాల్​లో ఆకర్షణగా నిలిచాయి. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన మండన్​ అరుణ ఈ స్టాల్స్​ను నిర్వహిస్తున్నారు. సిల్వర్​, జెర్మన్​తో తయారయ్యే తెలంగాణ లంబాడ డిజైన్లకు నార్త్​ ఇండియాలో గిరాకీ ఉంటుందన్నారు. కరోనా ప్రభావం ఉన్నా అమ్మకాలు బాగానే జరుగుతున్నాయని అరుణ చెప్పారు.

బంజారా స్టైల్​ బిర్యానీ

బిర్యానీ అనగానే హైదరాబాద్​ గుర్తొస్తుంది. కానీ, ఆదిమహోత్సవ్​లో బంజారా స్టైల్​ దమ్​ బిర్యానీ నోరూరిస్తోంది. మన రాష్ట్రానికి చెందిన అశోక్​ బంజారా బిర్యానీ స్టాల్​ ఏర్పాటు చేశారు. బంజారా స్టైల్​లో చేసిన చికెన్​, మటన్​ దమ్​ బిర్యానీ అమ్ముతున్నారు. 2019 ఆదిమహోత్సవ్​లో బంజారా బిర్యానీకి ఫస్ట్​ప్రైజ్​ వచ్చింది. చత్తీస్​గఢ్​ గిరిజనులు తినే ఎర్రచీమల చట్నీ స్పెషల్​గా నిలుస్తోంది.