- పీపీపీ విధానంలో నిర్వహించేందుకు టెండర్ల ఆహ్వానం
- కరీంనగర్, సిరిసిల్లసహా 6 ప్రాంతాల్లో హరిత ప్రాజెక్టుల అప్పగింత
- పర్యాటకులకు వసతులే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం
- వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్లు విడుదల చేసిన టీజీ టీడీసీ
- ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు టూరిస్టులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీ టీడీసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న హరిత హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టుల నిర్వహణ బాధ్యతలను 'ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్' ప్రాతిపదికన ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించనుంది. ఈ మేరకు పర్యాటక శాఖ వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5 వరకు వేర్వేరు తేదీల్లో ఈ టెండర్ల ప్రక్రియ ముగియనుంది. పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వంఈ నిర్ణయం తీసుకుంది.
బీవోటీ పద్ధతిలో 33 ఏళ్ల లీజుకు..
కరీంనగర్ హరిత హోటల్: దీనిని 'బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్' (BOT) పద్ధతిలో 33 ఏళ్ల లీజుకు ఇస్తారు. ఇప్పటికే 2 ఎకరాల్లో రూ.20 కోట్లతో జీ-ప్లస్ (G+) భవనాన్ని నిర్మించారు. దీనికి అదనంగా మరో రూ.26.10 కోట్లతో జీ-ప్లస్ 3 వరకు నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని వార్షిక లీజు రూ.56 లక్షలు కాగా, ఏటా 5 శాతం పెంపు ఉంటుంది. సిరిసిల్ల హరిత హోటల్: దీనికి కూడా 33 ఏళ్ల లీజు కాలపరిమితి విధించారు.
1.30 ఎకరాల్లో రూ.9 కోట్లతో ఉన్న జీ-ప్లస్ 1 భవనానికి అదనంగా రూ.10.20 కోట్లు వెచ్చించి 24 నెలల్లో విస్తరణ పనులు పూర్తి చేయాలి. దీని వార్షిక లీజు రూ.5.51 లక్షలు. కొత్తగూడెం హరిత హోటల్: దీనిని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విధానంలో 15 ఏళ్ల లీజుకు ఇవ్వనున్నారు. రూ.12.36 కోట్లతో నిర్మించిన భవనానికి అదనంగా రూ.7.6 కోట్లు వెచ్చించి 6 నెలల్లో అందుబాటులోకి తేవాలి. దీని వార్షిక లీజు రూ.80 లక్షలుగా నిర్ణయించారు. కిన్నెరసాని హరిత హోటల్: దీని లీజు కాలపరిమితి 15 ఏళ్లు. ప్రస్తుతం రూ.10 కోట్లతో ఉన్న భవనాన్ని, రూ.3 కోట్ల అదనపు పెట్టుబడితో 3 నెలల్లో సిద్ధం చేయాలి. వార్షిక లీజు రూ.24.40 లక్షలు.
ఆలంపూర్ హరిత హోటల్: దీనికి 5 ఏళ్ల లీజు కాలపరిమితి విధించారు. రూ.కోటి పెట్టుబడితో 3 నెలల్లో పనులు పూర్తి చేయాలి. వార్షిక అద్దె రూ.11.60 లక్షలు. గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలైన గట్టమ్మ, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బొగతలను కలిపి 'ట్రైబల్ సర్క్యూట్'గా ఓఅండ్ఎమ్ (O&M) విధానంలో 5 ఏళ్లకు లీజుకు ఇస్తున్నారు. దీని మొత్తం వార్షిక లీజు రూ.86.30 లక్షలుగా నిర్ణయించారు. (ఇందులో గట్టమ్మకు రూ.7.17 లక్షలు, మేడారానికి రూ.17.77 లక్షలు, తాడ్వాయికి రూ.28.38 లక్షలు, మల్లూరుకు రూ.4.84 లక్షలు, బొగతకు రూ.28.11 లక్షలుగా విభజించారు). ఈ ప్రాజెక్టుకు బిడ్ సెక్యూరిటీ రూ.43.15 లక్షలుగా నిర్ణయించారు.
భక్తులకు హైక్లాస్ వసతులు..
ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు లభించనున్నాయి. హోటల్ రంగంలో తగిన అనుభవం, ఆర్థిక స్థోమత ఉన్న సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనాలని టీజీటీడీసీ కోరింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ హోటళ్లను 3-స్టార్ లేదా అంతకంటే ఎక్కువ కేటగిరీ ప్రమాణాలతో నిర్వహించాల్సి ఉంటుంది. నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు ఆపరేటర్లే సొంతంగా పెట్టుబడి పెట్టాలి. వార్షిక లీజు ఫీజుతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రెవెన్యూ (ఆదాయం)లో వాటాను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు https://tender.telangana.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో బిడ్లు దాఖలు చేయవచ్చు.
