- టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి
హైదరాబాద్, వెలుగు: పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, యువతకు ఉపాధి కల్పించడంతోపాటు చారిత్రక కట్టడాలను పరిరక్షించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తెలిపారు. చారిత్రక కట్టడాల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అబిడ్స్‌లోని గన్‌ఫౌండ్రీ, కుతుబ్ షాహీ టూంబ్స్, రేమండ్స్ టూంబ్స్, ఖజానా బిల్డింగ్ వంటి చోట్ల ఎన్‌జీఓలు, విద్యార్థుల సహకారంతో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
వరంగల్, కరీంనగర్ వంటి పర్యాటక ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య డ్రైవ్‌లు నిర్వహించనున్నామని, ఇందులో భాగంగా జిల్లాలవారీగా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ‘యువ టూరిజం క్లబ్’ ల ద్వారా విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు. సెప్టెంబర్‌లో జరగనున్న పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మూడు ఉత్తమ క్లబ్‌లను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తామని, ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్లు ఆవిష్కరించనున్నట్టు వివరించారు.
పర్యాటక, హాస్పిటాలిటీ రంగంలో యువతకు కెరీర్ గైడెన్స్ వర్క్‌షాప్‌లు, ఆర్కియాలజీ అండ్ కన్జర్వేషన్‌లో సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. తెలంగాణ పర్యాటకాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రమోట్ చేసేందుకు కలెక్టర్లు, టూరిజం ఆఫీసర్ల ఆధ్వర్యంలో లోకల్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో మీటింగ్‌లు నిర్వహించనున్నట్టు చెప్పారు.
