నిరంతర మననంతో పద్యంపై ఆధిపత్యం

నిరంతర మననంతో పద్యంపై ఆధిపత్యం

హైదరాబాద్, వెలుగు:పద్యం వల్ల రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు భాషకు గుర్తింపు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ అయాచితం శ్రీధర్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో పరిషత్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సభలో శ్రీధర్‌‌‌‌కు మహాకవి వానమామలై వరదాచార్యుల పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన పద్య శిల్పంపై ప్రసంగిస్తూ పద్య రచన ఆషామాషీ కాదని, నిరంతర మననంతో పద్యంపై ఆధిపత్యం వస్తుందని తెలిపారు. పద్యాలను సంపదగా తెలుగుజాతికి అందించిన కవి నన్నయ అని తెలిపారు.

ఆచార్య శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ, కొందరి పద్య కవిత్వంలో గణాలే తప్ప గుణాలు కనిపించడం లేదని చమత్కరించారు. వచన కవిత్వం రాసేవారు ఆధునీకులని, పద్యం రాసేవారు ఛాందసులు అనేవి అపరిపక్వ భావాలన్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి, త్యాగరాయ గాన సభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి, ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి, జానపద పరిశోధకులు వసుంధర, నాగవాణి, ప్రముఖ కవి తిరుమల శ్రీనివాసాచార్య, పరిషత్ ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, పరిషత్ కోశాధికారి మంత్రి రామారావు తదితరులు పాల్గొన్నారు.