కశ్మీర్‌‌లోని బందిపొరాలో ఉగ్రవాదుల దుశ్చర్య

కశ్మీర్‌‌లోని బందిపొరాలో ఉగ్రవాదుల దుశ్చర్య

జమ్ము కశ్మీర్‌‌లో మరోసారి ముష్కర మూకలు తెగబడ్డాయి. ఉత్తర కశ్మీర్‌‌లోని బందిపొరా జిల్లా గుల్షన్ చౌక్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల టీమ్‌పై ఉన్నట్టుండి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మహ్మద్ సుల్తాన్, ఫయాజ్ అహ్మద్‌గా గుర్తించామని జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ముష్కరులను పట్టుకునేందుకు ఆ ఏరియాను జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. ఆ పరిసరాల్లో కార్డన్ సెర్చ్ నడుస్తోందని అన్నారు.

ముష్కర దాడిని ఖండించిన సీఎం ఒమర్ అబ్దుల్లా

బందిపొరాలో జరిగిన ఈ ఉగ్రదాడిని కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఈ ఘటనలో మరణించిన ఇద్దరు పోలీసులు మహ్మద్ సుల్తాన్, ఫయాజ్ అహ్మద్‌లకు అల్లా స్వర్గ ప్రాప్తి కల్పించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని అన్నారు.