కళాకారుల ఊరు అమదుబి

కళాకారుల ఊరు అమదుబి

ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ కళాకారులే. అందుకే దాన్ని ఆర్ట్​ విలేజ్ అంటారు.ఒకప్పుడు ఆ ఊరికి అడ్రస్ చెప్పాలంటే చుట్టుపక్కల ఉన్న నాలుగైదు ఫేమస్​ ప్లేస్​ల పేర్లు చెప్పాల్సి వచ్చేది. అంత మారుమూల గ్రామం అన్నమాట. ఆ ఊరు ఒకటి అక్కడ ఉందని తెలిసేది కాదు.ఇంతకీ ఆ ఊరి పేరు ఏంటంటే ‘అమదుబి’. ఒట్టి అమదుబి కాదు.అమదుబి కళాగ్రామ్. అంటే కళాకారుల గ్రామం అని అర్థం. మరి అందుకే ఆ ఊరి గురించి, వారి కళ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

అమదుబి కళాకారుల ఆర్ట్ పేరు ‘ప్యాట్కర్’. అంటే పాటలు, కథలను పెయింటింగ్స్ వేయడం. ఇది వందల ఏండ్లనాటి జానపద కళ. అంతేనా... వాళ్లు స్వయంగా చేతులతో చేసిన వస్తువులు, పెయింటింగ్స్, వాయిద్యాలు చూస్తే ‘అద్భుతం’ అనాల్సిందే. అంతేకాదు, కావాలంటే వాటిని కొనుక్కోవచ్చు కూడా. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే మాటకు వాళ్ల కళే నిదర్శనం. ఇంతటి ఘనత ఉన్న ఈ ఊరు జార్ఖండ్​లోని జంషెడ్​పూర్​ ఊరి శివార్లలో ఉంది. ‘అమదుబి’ ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ప్రజలంతా కళాకారులే. వాళ్లంతా పెయింటింగ్స్, పాటలు పాడటం, పురాణకథలు చెప్పడం వంటివి చేస్తుంటారు. అందుకే దీన్ని ‘కళాకారుల గ్రామం’ అంటారు. 

జార్ఖండ్​లోని తూర్పు సింగం​ జిల్లాలో ఉంది అమదుబి. ఒకానొక సమయంలో బిహార్, బెంగాల్, ఒడిశా.. ఈ మూడు రాష్ట్రాలు కలిసే చోటు పేరు ‘మన్​భుమ్’. దీన్ని ట్రై జంక్షన్​ అంటారు. ఆ ప్రాంతంలో చిత్రకారులు, కళాకారులు ఉండేవాళ్లు. వాళ్లందర్నీ కలిపి ‘చిత్రకారులు​’ అని పిలిచేవాళ్లు. వాళ్లంతా చెట్ల బెరడు లేయర్ల మీద, బట్టల మీద పెయింటింగ్​ వేసేవాళ్లు. ఆ కళను వాళ్లు ‘ప్యాట్కర్’ అని పిలిచేవాళ్లు. ఈ ఊళ్లో వేటగాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల చేతుల్లో విల్లంబులు, బాణాలు ఉన్నాయి. కొన్ని చోట్ల వాళ్లు వేటాడిన జంతువుల మాంసాన్ని కాల్చేందుకు మంటలు వేసిన గుర్తులు ఉన్నాయి. గుడిసెల్లో నివసించే వీళ్లు  రుసికో శాంగెకొ దగ్గర ఉంటారు. అంటే ఆర్టిస్ట్​ల కుగ్రామానికి దగ్గర్లో అన్నమాట. 

శాంతల్ తెగ

వీళ్ల తెగ పేరు శాంతల్​. పూర్వకాలంలో వాళ్లు పాటలు రాయడానికి పురాణాలను స్ఫూర్తిగా తీసుకుని వాటినుంచే పద్యాలు అల్లేవాళ్లు. కథకోసం ఒక లైన్​ అనుకున్నాక, స్కెచ్​ గీసుకున్నట్టు అప్పట్లో వాళ్లు  పెయింటింగ్​ వేసేవాళ్లు. ఆ పెయింటింగ్ కూడా మినరల్స్, కూరగాయల నుంచి తీసిన రంగుల్నే వాడేవాళ్లు. లేదంటే అడవిలోపలికి వెళ్లి రాళ్లు, మట్టి, ఆకుల నుంచి రంగులు తయారుచేసుకునేవాళ్లు. పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చుట్టిన బట్టను నెమ్మదిగా విప్పుతారు. పాట పాడుతుండగా ఏ లైన్​ పాడితే ఆ లైన్​ చూపిస్తుంటారు. ఊరూరా తిరుగుతూ భక్తి పాటలు పాడుతుంటారు. ఈ తెగలో ఎవరైనా చనిపోతే, చనిపోయిన వ్యక్తి కళ్లను పెయింటింగ్ గీస్తారు ఆర్టిస్ట్​లు. ఆ పెయింటింగ్​ను వాళ్ల ఇంటికి తెస్తారు. ఎందుకంటే, చనిపోయిన వాళ్ల కళ్లను పెయింటింగ్ వేశాకే, వాళ్ల ఆత్మ స్వర్గానికి వెళ్లే దారి తెలుసుకుంటుందని నమ్ముతారు వాళ్లు.

చిత్రకారుల కుటుంబాలు 

ఆర్టిస్ట్​లు ఆ పద్యాలను పెయింటింగ్, స్కెచ్​లు వేస్తారు. పండుగలప్పుడు ప్రదర్శనలు జరుగుతాయి. రాత్రంతా సంబురాలు చేసుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ 50 చిత్రకారుల​ కుటుంబాలు ఉంటున్నాయి. వాళ్ల ఇండ్లు మట్టి, వెదురు, చెక్కలతో కట్టుకుంటారు. సాల్, పియల్ అనే చెట్లు పెరుగుతాయి ఇక్కడ. గోడలకు చేత్తో వేసిన పెయింటింగ్స్​ కనిపిస్తాయి. తలుపులు, కిటికీలకు దోక్రా హ్యాండిల్స్ ఉంటాయి. పురాతన మైనం టెక్నిక్​తో తయారుచేసిన సంప్రదాయబద్ధమైన మెటల్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. గురుకుల్ లేదా వర్క్​షాప్​లో, మహిళలు బ్లాకుల ఆధారంగా వేసే  ప్రింటింగ్ నేర్చుకుంటారు. ప్యాట్కర్ మోటిఫ్‌లను కొంతా ఎంబ్రాయిడరీకి ​​మార్చారు. ‘ప్యాట్కర్’ డిజైన్స్ సిల్క్ స్కార్ఫ్​లు, శాలువాలు, కుషన్ కవర్లు, చెక్క ఫ్రేమ్స్​ వంటి వాటి మీద వేస్తారు. 

వాయిద్యాలు

ఫ్లూట్, కోకోనట్ బాణం (తంబుర లాంటిది), మండర్ (పొడవాటి డప్పు), బాణం (వయొలిన్​ లాంటిది) వంటి వాయిద్యాలను సోహ్రాయ్, టుసు పండుగలప్పుడు వాడతారు శాంతల్​లు. బహ, సర్పా, దసయ్ డాన్స్​లు చేస్తారు. ఇవన్నీ బెహ్దా గ్రామంలో జరుగుతాయి. అది కూడా అమదుబి పనిజియా టూరిజం సెంటర్​ కిందనే వస్తుంది. వీటిని టూరిస్ట్​లు కొనుక్కోవచ్చు.  వీటితోపాటు ప్యాట్కర్​ పెయింటింగ్స్, సోహ్రాయ్​ పెయింటింగ్ ఫ్రేమ్స్​ కొనుక్కోవచ్చు. ఒక చిన్న మ్యూజియంలో పాత్రలు, సంప్రదాయ సంగీత వాయిద్యాల కలెక్షన్​ ఉంది. 

సాహసాల దారిలో...

ఇక్కడ పారా సెయిలింగ్, రాఫ్టింగ్, మౌంటైన్ క్లైంబింగ్, డైవింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ చాలానే ఉన్నాయి. ఒక అడ్వెంచర్ క్లబ్ కూడా ఉంది. ఇక్కడ కార్లు, ట్యాక్సీల్లో తిరగరు. ఎద్దుల బండి వాడతారు. టూరిస్ట్​ల కోసం గుడిసెలు, కాటేజ్​లు స్పెషల్​గా మెయింటెయిన్ చేస్తారు. ఏ సీజన్​లో అయినా ఇక్కడికి వెళ్లొచ్చు. 

కళాగ్రామ్

జంషెడ్​పూర్​కి 65 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది అమదుబి. కొన్నేండ్ల కిందట ‘వరల్డ్ టూరిజం డే’ సందర్భంగా అమదుబిని ‘కళాగ్రామ్’​ అంటే ఆర్ట్ విలేజ్​గా​ పిలిచారు. విలేజ్​ టూరిజం కోసం అమదుబి పనిజియా రూరల్ టూరిజం సెంటర్​ ఏర్పాటు చేశారు. ఇది జంషెడ్​పూర్​కి చెందిన బిస్తుపూర్​లోని కాలామందిర్​ మేనేజ్​మెంట్​ చూసుకుంటుంది.

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుంచి రాంచీలోని బిర్సా ముండా ఎయిర్​ పోర్ట్​ వరకు వెళ్లాలి. అక్కడి నుంచి కారులో జంషడ్ పూర్ వెళ్లి, అక్కడి నుంచి అమదుబికి కారు​లో రెండు గంటల ప్రయాణం. ట్రైన్​లో జంషెడ్ పూర్​ బయలుదేరితే 26 గంటలు జర్నీ చేయాలి. అక్కడి నుంచి ట్యాక్సీలో అమదుబికి వెళ్లొచ్చు. 

సంబురాలు

వ్యవసాయ పద్ధతులకు ముడిపడిన పండుగ ‘సర్ఫా’. ఇలాంటి పండుగలప్పుడు లేదా ‘అఖారా’ అనే పిలిచే బహిరంగ వేదికల్లో ట్రెడిషనల్ డాన్స్​లు వేస్తారు. ప్రదర్శన తర్వాత, లాంతర్ల కాంతిలో అక్కడి వంటకాలు రుచి చూడొచ్చు. ‘కంస’ (ఇత్తడి) పళ్ళెంలో ‘ఉడ్ పిఠా’ ( పప్పుతో ఉడికించిన బియ్యం కుడుములు), ‘గుడ్ పిఠా’ ( బెల్లంతో చేసిన తీపి అన్నం కుడుములు), ‘జిల్ పిఠా’ (చికెన్ ఫ్రైడ్ రైస్ కుడుములు) వంటి ఫుడ్ తింటారు.