కొనసాగుతోన్న డొమెస్టిక్ ఇన్వెస్టర్ల హవా

కొనసాగుతోన్న డొమెస్టిక్ ఇన్వెస్టర్ల హవా
  • విదేశీ ఇన్వెస్టర్లు రూ. 2.3 లక్షల కోట్ల మేర అమ్మేసినా మన మార్కెట్లు పెద్దగా పడలే!
  • డొమెస్టిక్ ఇన్వెస్టర్ల నుంచి ఫుల్ సపోర్ట్‌‌‌‌ 
  • గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్‌‌  కంటే ఈ సారి ఎఫ్‌‌ఐఐల నుంచి ఎక్కువ సెల్లింగ్‌‌

న్యూఢిల్లీ: దేశ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌లో డొమెస్టిక్ ఇన్వెస్టర్ల హవా రోజు రోజుకి పెరుగుతోంది. ఎంతలా అంటే గత ఐదు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌‌‌‌ఐఐ) మార్కెట్ల నుంచి వెళ్లిపోతున్నప్పటికీ, బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లయిన నిఫ్టీ, సెన్సెక్స్‌‌‌‌లు అంతగా నష్టపోలేదు. గత ఐదు నెలల్లో రూ. 2.3 లక్షల కోట్ల విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు అమ్మేశారు. మార్కెట్‌‌‌‌ చరిత్రలో ఎఫ్‌‌‌‌ఐఐలు ఇంతలా బయటకు వెళ్లిపోవడం ఇదే మొదటి సారి.  కానీ, ఈ టైమ్‌‌‌‌లో ఇండెక్స్‌‌‌‌లు 15 శాతం మాత్రమే నష్టపోయాయి.  2008  ఫైనాన్షియల్ క్రైసిస్ టైమ్‌‌‌‌లో  దేశ మార్కెట్‌‌‌‌ నుంచి రూ. 1.3 లక్షల కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు బయటకు తీసేశారు. ఆ టైమ్‌‌‌‌లో  మన ఇండెక్స్‌‌‌‌లు ఏకంగా 60–65 శాతం పతనమయ్యాయి. ఈ సారి ఎఫ్‌‌‌‌ఐఐలు పెద్ద మొత్తంలో అమ్మేస్తున్నా, డొమెస్టిక్ ఇన్వెస్టర్ల నుంచి సపోర్ట్ పెరగడంతో మార్కెట్లు పడడం లేదని స్వస్తిక్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ సంతోష్ మీనా పేర్కొన్నారు. ప్రస్తుతం మనం పూర్తిగా ఎఫ్‌‌‌‌ఐఐలపైనే ఆధారపడడం లేదని అన్నారు. మిగిలిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు మంచి పొజిషన్‌‌‌‌లో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రష్యా–ఉక్రెయిన్‌‌‌‌ యుద్ధాన్ని  మార్కెట్‌‌‌‌ పరిగణనలోకి తీసుకొందని, ఈ వార్‌‌‌‌‌‌‌‌ త్వరలో ముగిసే అవకాశం ఉందని అన్నారు. ఈ యుద్ధానికి సంబంధించిన వార్తలు మార్కెట్‌‌‌‌లో వోలటాలిటీ పెంచొచ్చన్నారు.

ఎఫ్‌‌‌‌ఐఐలు బయ్యర్లుగా.. 

ప్రస్తుత లెవెల్స్‌‌‌‌ నుంచి మార్కెట్లు మరింత పెరుగుతాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. గత వారం ఎఫ్‌‌‌‌ఐఐలు మార్కెట్‌‌‌‌లో కొనుగోలుదారులుగా మారారని చెబుతున్నారు. యూఎస్‌‌‌‌, చైనా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం  సద్దుమణుగుతోందని పేర్కొన్నారు.