ఘనంగా ముగిసిన ద‌స‌రా న‌వ‌రాత్రి వేడుకలు

ఘనంగా ముగిసిన ద‌స‌రా న‌వ‌రాత్రి వేడుకలు

క‌రోనా నేప‌థ్యంలో దేశంలోని ప్ర‌జ‌లంతా స్వీయ జాగ్ర‌త్త‌లు పాటిస్తూ దసరా వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భ‌క్తి, శ్ర‌ద్ధ‌ల‌తో బతుక‌మ్మ‌, ద‌స‌రా ఉత్స‌వాల‌ను జరుపుకున్నారు. తెలంగాణ‌లో ఊరూరా బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలంతా రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఇండ్ల మధ్య ఉంచి ఆట పాటలతో సందడి చేశారు. అదే విధంగా ఏపీలోనూ అమ్మ‌వారి శ‌ర‌న్న‌వరాత్రి ఉత్స‌వాలు, శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈనెల 17 వ తేదీన శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని కనకదుర్గా ఆలయంలో 9 రోజులపాటు ఒక్కొక్కరోజు ఒక్కో అమ్మవారి అలంకరణతో దుర్గాదేవి పూజలు అందుకున్నారు. ఆదివారం రాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. అనంతరం దుర్గాదేవి ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో శరన్నవరాత్రి వేడుకలు ముగిశాయి.