హాజీపూర్​ కిల్లర్​నూ ఎన్ కౌంటర్ చేయాలె

హాజీపూర్​ కిల్లర్​నూ ఎన్ కౌంటర్ చేయాలె
  • చంపితేనే మాకు న్యాయం జరుగుతుంది
  • గవర్నర్​ను కోరిన బాధిత కుటుంబాలు
  • ఈ ఇష్యూ తన నోటీసు లో ఉందన్న తమిళిసై

హైదరాబాద్, వెలుగు: ‘‘దిశ ఘటనలో నలుగురు నిందితులను ఎలా ఎన్ కౌంటర్ చేశారో.. మా అమ్మాయిలను చంపిన నిందితుడిని కూడా అలాగే శిక్షించాలి. వాణ్ని బతకనీయొద్దు. జల్దీ ఎన్ కౌంటర్ చేయాలి లేదా ఉరి అన్నా తీయాలి”అని హాజీపూర్​లో అత్యాచారాలకు బలైన చిన్నారుల తల్లిదండ్రులు గవర్నర్​ తమిళిసైని కోరారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని కోరుతూ గవర్నర్​కు వినతిపత్రం ఇచ్చారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు తమిళిసైని కలిశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ లో పిల్లలను ‘లిఫ్ట్ ఇస్తా’ అని బండిపై తీసుకెళ్లి అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపేశాడు. వారి శవాలను బావిలో పూడ్చిపెట్టాడు. గవర్నర్​ను కలిసిన తర్వాత జాజుల శ్రీనివాస్​గౌడ్​ మీడియాతో మాట్లాడారు. బాధితుల తల్లిదండ్రులతో గవర్నర్‌ను కలిశామని, హాజీపూర్ సంఘటనను వివరించామని, తన నోటీసులో ఈ ఇష్యూ ఉందని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని గవర్నర్​ హామీ ఇచ్చారని చెప్పారు. అగ్రకులాలకు ఒకలా, బడుగు బలహీన వర్గాలకు మరోలా న్యాయం ఉండకూడదని, అందరికీ సమాన న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. ‘‘మాకు న్యాయం చేయాలని అడిగినం, మేడమ్ న్యాయం చేస్తా అని హామీ ఇచ్చారు. పిల్లల్ని తీసుకెళ్తండు, సంపుతుండు, బాయిలో వేస్తుండు, ఒక్కణ్నే ఎందుకు సంపుతలేరు? వాణ్ని అట్లనే సంపాలి. వాణ్ని సంపితేనే మాకు న్యాయం చేసినట్టు అవుతుంది’’ అని బాధిత తల్లిదండ్రులు చెప్పారు. తొందరలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి శిక్ష పడుతుందని గవర్నర్ చెప్పారని హాజీపూర్ సర్పంచ్ కవిత చెప్పారు.

The Hajipur killer must be countered: parents of victims