డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే శిక్ష తప్పదు: కేరళ హైకోర్టు

డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే శిక్ష తప్పదు: కేరళ హైకోర్టు

కొచ్చి: మేజిస్ట్రేట్స్, జడ్జిలు, ప్రిసైడింగ్‌‌ ఆఫీసర్లు చట్టానికి అతీతులు కాదని, డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కేరళ హైకోర్టు పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతం లక్ష ద్వీప్‌‌ మాజీ చీఫ్‌‌ జ్యుడీషియల్‌‌ మేజిస్ట్రేట్‌‌(సీజేఎం).. ఒక నిందితుడిని దోషిగా నిర్ధారించడానికి నకిలీ సాక్ష్యాలను సృష్టించారని, దీంతో ఆయనను సస్పెండ్‌‌ చేస్తున్నామని ఉత్తర్వులు జారీచేసింది. ఆయన సస్పెన్షన్‌‌ అందరికీ ఒక పాఠం అని జస్టిస్‌‌ పీవీ కున్హి కృష్ణన్‌‌ అన్నారు. సస్పెన్షన్‌‌ ఉత్తర్వులు అమలు చేయాలంటూ లక్ష్యదీప్‌‌ అడ్మినిస్ట్రేటర్‌‌‌‌కు ఆదేశాలు జారీ చేశారు. మాజీ సీజేఎం కె.చెరియకోయాతో పాటు అప్పటి బెంచ్‌‌ క్లర్క్‌‌ పీపీ ముత్తుకోయ, ఎల్‌‌డీ క్లర్క్‌‌ ఏసీ పుతున్నిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 23న హైకోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, కొబ్బరికాయలు తీయడాన్ని అడ్డుకున్నందుకు అగట్టికి చెందిన ఓ కాంట్రాక్టర్‌‌‌‌.. పోలీసుల సాయంతో తమపై కేసు నమోదు చేశారని పిటిషనర్లు ఆరోపించారు. మరోవైపు వ్యక్తిగత కారణాల వల్ల మాజీ సీజేఎం నకిలీ ఎవిడెన్స్‌‌లు క్రియేట్‌‌ చేసి, తమకు జైలు శిక్ష విధించారని ఆరోపించారు. మాజీ సీజేఎంతో బెంచ్‌‌ క్లర్క్‌‌, ఎల్‌‌డీ క్లర్క్‌‌ కుమ్మక్కు అయ్యారని చెప్పారు. అయితే, ఇన్వెస్టిగేషన్‌‌ ఆఫీసర్‌‌‌‌ ఎవిడెన్స్‌‌ నమోదు చేయకుండానే, సీజేఎం తమను దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చారని పిటిషనర్లు పేర్కొన్నారు. కాగా, మాజీ సీజేఎం ముందు తాను సాక్ష్యం ఇవ్వలేదని ఇన్వెస్టిగేషన్‌‌ ఆఫీసర్‌‌‌‌ హైకోర్టుకు అఫిడవిట్‌‌ను సమర్పించారు. సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు.. మాజీ సీజేఎం నకిలీ ఎవిడెన్స్‌‌ను సృష్టించారని వెల్లడించింది.