అపోజిషన్ దివాలా తీసింది: ప్రకాశ్ జవదేకర్

అపోజిషన్ దివాలా తీసింది: ప్రకాశ్ జవదేకర్
  •     అందుకే బోగస్ క్రిటిసిజం
  •     కేంద్ర మంత్రి జవదేకర్ విమర్శలు
  •     రాజకీయ కక్ష సాధించాల్సిన
  •     అవసరం మాకు లేదు
  •     నేతలను జైలులో పెట్టేది కోర్టులు.. ప్రభుత్వం కాదు
  •     కాశ్మీర్‌లో మీడియాపై ఆంక్షల్లేవు
  •     ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే పత్రికా స్వేచ్ఛపై దాడి

న్యూఢిల్లీ: ప్రతిపక్షం దివాలా తీసిందని కేంద్ర ఇన్ఫర్మేషన్, బ్రాడ్​కాస్టింగ్ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. కొన్ని పార్టీలపై రాజకీయంగా కక్ష సాధిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘‘ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదు. అంతా బోగస్ క్రిటిసిజం. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వారి వద్ద ఎలాంటి అంశాలు లేవు. ప్రతిపక్షాలు దివాళా తీశాయి” అని విమర్శించారు. పీటీఐ జర్నలిస్టులతో ఆయన ఆదివారం ఇంటరాక్ట్ అయ్యారు. ‘‘నేతలను జైలులో పెట్టేది, వారికి బెయిల్ ఇచ్చేది, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించేది కోర్టులే. ఆ అధికారం కోర్టులకే ఉంది. కోర్టులే ఆదేశాలిస్తాయి. ప్రభుత్వం కాదు” అని స్పష్టం చేశారు. ‘‘దర్యాప్తును, సాక్ష్యులను ప్రభావితం చేస్తారనే కొందరు నిందితులకు కోర్టులు బెయిల్ ఇవ్వవు. వాళ్లనే జైలులోనే ఉంచాలని ఆదేశిస్తాయి” అని వివరించారు.

పబ్లిసిటీ కాదు.. 24X7 పని చేస్తం

ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటుందని, ‘హెడ్​లైన్స్​మేనేజ్​మెంట్’ చేస్తుందన్న విమర్శలపైనా జవదేవకర్ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రోజుకు 24 గంటలూ పని చేస్తున్నాయని చెప్పారు. గత ఐదేళ్లలో వేలాది విజయాలు సాధించినట్లు చెప్పారు. ‘సింగిల్ పార్టీ సిస్టమ్’ వైపు దేశం నడుస్తోందన్న కామెంట్స్​పై స్పందిస్తూ.. ‘‘మేం ఏ పార్టీనీ అంతం చేయడం లేదు. ఇతర పార్టీలను నడపడం.. ఆయా పార్టీలు రాజకీయ రంగంలో నిలబడేలా చేయడం నా ఉద్యోగం కాదు. వాళ్ల పార్టీల్లో వాళ్లకు ఇన్​స్పిరేషన్ లేకపోతే నేనేం చేస్తా. ఇన్​స్పిరేషన్​లేకనే చాలా మంది బీజేపీలో చేరుతున్నారు. అంతకుమించి ఇంకో కారణమంటూ ఏం లేదు” అని బదులిచ్చారు.
ఆర్టికల్ 370ని అడ్డుపెట్టుకుని టెర్రరిజాన్ని ఎగదోశారు

ఆర్టికల్ 370 ఉండటం వల్ల జమ్మూకాశ్మీర్​లో 126 చట్టాలు అమలయ్యేవి కాదని, ఇప్పుడు అవి కూడా అక్కడ వర్తిస్తాయని జవదేకర్ చెప్పారు. ‘‘విద్యా హక్కు చట్టం కింద 25 శాతం మంది ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్లు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉంది. మొన్నటివరకు జమ్మూకాశ్మీర్​లో ఇది అమలు కాలేదు. కానీ ఇప్పుడు అమలవుతోంది. స్టూడెంట్లకు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తోంది” అని వివరించారు. ఆర్టికల్ 370ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ గత 50, 60 ఏళ్లుగా వేర్పాటువాదాన్ని, టెర్రరిజాన్ని ఉసిగొల్పిందని మండిపడ్డారు. ఇప్పుడు కాశ్మీర్ ప్రజలకు ఆ బాధ లేదన్నారు.

జమ్మూకాశ్మీర్ ప్రజలు సంతోషంగా ఉన్నరు

జమ్మూకాశ్మీర్​లో పరిస్థితి మామూలుగానే ఉందని జవదేకర్ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దేశంలోని పౌరులకు అందుతున్న బెనిఫిట్స్.. ఇప్పుడు జమ్మూకాశ్మీర్​ప్రజలకు కూడా అందుతాయని తెలిపారు. కాశ్మీర్ వ్యాలీలో మీడియాపై ఎలాంటి ఆంక్షల్లేవని, న్యూస్ పేపర్లు ఎలాంటి సమస్యలు లేకుండా పబ్లిష్ అవుతున్నాయని పేర్కొన్నారు. కేవలం ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందని ఆరోపించారు. హర్యానా, మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే జమ్మూకాశ్మీర్​స్పెషల్ స్టేటస్​ను రద్దు చేశారని వస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ తమ నిర్ణయాన్ని స్వాగతించారని చెప్పారు.