ఢిల్లీని పాలించేది ప్రభుత్వమే.. సుప్రీం తీర్పుతో కేజ్రీవాల్ హ్యాపీ

ఢిల్లీని పాలించేది ప్రభుత్వమే.. సుప్రీం తీర్పుతో కేజ్రీవాల్ హ్యాపీ
  • చారిత్రక తీర్పు వెలువడించిన సుప్రీం కోర్టు

ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే విషయంలో స్థానిక ఆప్ సర్కార్ కి, కేంద్రానికి నడుస్తున్న వివాదం కొలిక్కివచ్చింది. ఈ వివాదంలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉండాలని స్పష్టం చేసింది.  ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న గత తీర్పును తోసిపుచ్చింది. 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించబోమని స్పష్టం చేసింది.

ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలకే నిజమైన అధికారాలు ఉంటాయని పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.  శాంతి భద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇదే అంశంపై స్పష్టమైన తీర్పు వెలువరించింది. 

పూర్వాపరాలు ఇవీ..

ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికారాల విషయంలో స్పష్టత కరవై తరచూ వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సుప్రీంలో అధికారాల పరిధిపై విచారణ జరిగింది. తీర్పు రాష్ర్ట ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో సీఎం కేజ్రీవాల్ సర్కార్ కు ఊరట లభించింది.