సోలో జర్నీ.. సో బెటర్!

సోలో జర్నీ.. సో బెటర్!

కార్పొరేట్​ ఉద్యోగం.. ఈ తరం యువతలో ఎంతోమంది కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడతరు. కారణం ఐదంకెల జీతం కావొచ్చు. చేతికి మట్టి అంటని వైట్​ కాలర్​ జాబ్​ అనే ఫీలింగ్​ కావొచ్చు. అందుకే కార్పొరేట్​ ఉద్యోగానికి అంతగా అట్రాక్ట్​ అవుతుంటరు. మంచి కంపెనీలో జాబ్​ దొరికితే లైఫ్​లో సెటిల్​ అయినట్లే అని భావిస్తరు. అలాంటిది ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా ఐదు కార్పొరేట్​ ఉద్యోగాల్ని వదులుకుంది శివ్యానాథ్​.  ఇది కాదు జీవితం.. అనుకుంది. సోలో జర్నీ మొదలుపెట్టి  ప్రపంచాన్ని చుట్టేసింది. అప్పుడనిపించింది ఆమెకు ‘ఇది కదా జీవితం’ అని. తన అనుభవాలతో ఓ పుస్తకం రాసింది. క్రిటిక్స్​ సైతం ఆ పుస్తకం ఎంతో ఇన్​స్పైరింగ్​ ఉందంటున్నరు.

శివ్యానాథ్​ పుట్టింది డెహ్రాడూన్​లో​.  కొండలు, గుట్టలతో ఉండే ఆ ప్రాంతంలోనే ఆమె బాల్యమంతా గడిచింది. చిన్నప్పుడు ప్రతిరోజూ ఇంటి బయటకు వచ్చి కొండల్ని చూస్తూ మనసులో అనుకునేది..  వాటి అవతల ఏముందా? అని. స్కూల్​ డేస్​లో ఓ సారి టూర్​ వెళ్లినప్పుడు ఎంతో థ్రిల్​​గా ఫీలైంది. అప్పటి నుంచే కిడ్డీ బ్యాంక్​లో డబ్బు దాచుకోవడం, ఆ డబ్బును కేవలం టూర్లకు వెళ్లేందుకు మాత్రమే ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంది. అలా చిన్నప్పటి నుంచే దేశాన్ని చుట్టి రావాలన్న కోరికను పెంచుకుంది. కాలేజీలో చేరగానే వీకెండ్స్​లో ఫ్రెండ్స్​తో కలిసి టూర్స్​కు వెళ్లేది. తక్కువ ఖర్చులోనే తిరిగొచ్చేలా ముందుగానే ప్లాన్​ చేసేది. అలా మొదలైన ఆమె జర్నీ ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఆగలేదు.

ఇంటర్మీడియెట్​ పూర్తికాగానే గ్రాడ్యుయేషన్​ చేసేందుకు సింగపూర్​కు వెళ్లింది. చదువుపై ఇష్టం కంటే విదేశాలకు వెళ్లి రావాలనే ఆలోచనతోనే సింగపూర్​లో గ్రాడ్యుయేషన్​ పూర్తిచేసింది. అప్పుడే సింగపూర్​ టూరిజం బోర్డులో జాబ్​ ఖాళీగా ఉన్న విషయం తెలుసుకొని మరో ఆలోచన లేకుండా జాయిన్​ అయ్యింది.  ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్రావెల్‌‌‌‌ బ్లాగర్లను ఫాలో కావడం మొదలుపెట్టింది. 2011లో జాబ్​కు రెండు నెలలు సెలవు పెట్టి పశ్చిమ యూరప్‌‌ మొత్తం చుట్టి వచ్చింది.

యూరప్​ నుంచి తిరిగొచ్చాక ఇండియాకు వచ్చేసి సెటిల్​ అవుదామనుకుంది.  ఢిల్లీలో కార్పొరేట్​ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఉదయం లేచి ఆఫీసుకెళ్లడం,  సాయంత్రం ఇంటికి తిరిగిరావడం.. వంటి  టెన్​ టు ఫైవ్​ లైఫ్​ స్టయిల్​  బోర్​ కొట్టిందామెకు. దాదాపు నాలుగైదు కంపెనీలు మారింది. దేంట్లోనూ సెటిల్​ కాలేకపోయింది​. ఇది కాదు జీవితం అనుకుంది.  జాబ్స్​కు గుడ్​ బై చెప్పి మళ్లీ జర్నీ మొదలుపెట్టింది. స్పితీ వ్యాలీకి (హిమాలయాలు) వెళ్లి నెలరోజులు సన్యాసినిగా గడిపింది. లైఫ్​ అంటే ‘సోలో జర్నీ’ అని తెలుసుకుంది. అక్కడి నుంచి ఆమె ప్రయాణం సోలోగానే సాగింది.

ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ ఇలా ప్రపంచంలోని చాలా దేశాలను సోలోగానే తిరిగింది శివ్యా. నచ్చిన ప్లేస్​లో ఇష్టమొచ్చినన్ని రోజులు ఉండడం, బోర్​ కొట్టగానే మరో ప్రయాణం మొదలుపెట్టడమే లైఫ్​ స్టయిల్​గా మార్చుకుంది. ఊహలను, కలలను నిజం చేసుకుంటూ జర్నీని కంటిన్యూ చేసింది. బస్సులు, రైళ్లు, విమానాలు, ఓడలు.. ఏది అందుబాటులో ఉంటే దాంట్లో జర్నీ చేసింది. ఈ జర్నీలో రకరకాల మనుషుల్ని కలిసింది. కొత్త కొత్త అనుభవాలను సంపాదించుకుంది. స్పెయిన్​ టూర్​కి వెళ్ళినపుడు స్పానిష్​ నేర్చుకుంది.  స్పెయిన్​లో మన్యన్​ తెగలతో కలిసి కొన్ని నెలలపాటు అక్కడే ఉండిపోయింది. అక్కడ ఓ వ్యక్తి హిందీ మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత టర్కీ, బెహ్రెయిన్, కెనడా దేశాల్లోనూ తిరిగింది. ఇక ఇండియాలో శివ్యా తిరగని ప్లేస్​ లేదు.  మారిషస్​ వెళ్లినప్పుడు స్వర్గంలో ఉన్నట్లుగా ఫీలైంది. అక్కడే ఆమె నరకాన్ని కూడా చూసింది. హెల్త్​ సహకరించలేదు. వైరల్​ ఫీవర్​తో బాగా ఇబ్బంది పడింది. చూసుకునేవాళ్లు లేక చనిపోతానని భయపడింది. వారంరోజుల తర్వాత కోలుకుంది. అప్పటి నుంచి హెల్త్​ను కాపాడుకుంటూ జర్నీ చేయడం నేర్చుకుంది.

జీవితం నేర్పిన ఎన్నో పాఠాలను, సోలో జర్నీలో తాను ఫేస్​ చేసిన వాటిని  వివరిస్తూ  ‘ది షూటింగ్‌‌ స్టార్‌‌ : ఎ గర్ల్, హర్‌‌ బ్యాక్‌‌ప్యాక్‌‌ అండ్‌‌ ది వరల్డ్‌‌’ అనే బుక్​ను రాసింది. పెంగ్విన్‌‌ రాండమ్‌‌ హౌస్‌‌ ఈ బుక్​ను పబ్లిష్​ చేసింది. మహిళలు ఒంటరిగా బతకాల్సి వస్తే ఈ పుస్తకం తప్పకుండా చదవాలంటున్నరు క్రిటిక్స్. ఎందుకంటే కేవలం 23 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టేసిన శివ్యానాథ్​ అనుభవాలు ఎంతో ధైర్యాన్నిస్తాయంటున్నరు. మనీ మేనేజ్​మెంట్, టైం మేనేజ్​మెంట్​ వంటి విషయాలతోపాటు  కొత్త పరిచయాలు, కొత్త వారితో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవచ్చంటున్నరు. పుస్తకంలోని ప్రతి అక్షరం మహిళకు బతుకు దారి చూపుతోందని చెబుతున్నరు.