మెయింటెనెన్స్ సరిగా లేదని తల్లిదండ్రుల ఆందోళన
ఎల్ బీ నగర్, వెలుగు: పురుగుల అన్నం, పుచ్చిపోయిన కూరగాయలు, నీళ్ల చారుతో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సుమారు 550 మంది విద్యార్థినిలకు భోజనం పెడుతున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గమైన మహేశ్వరం మండలానికి చెందిన సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల స్కూల్లో దుస్థితి ఇది. మహేశ్వరం మండలానికి ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఆరేండ్ల కిందట శాంక్షన్ కాగా.. దీన్ని చేవేళ్ల సెగ్మెంట్ పరిధి షాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ స్కూల్లో సరైన సౌలతులు లేవని.. విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం పెట్టట్లేందంటూ వారి తల్లిదండ్రులు చెప్తున్నారు. గతంలో ఒకసారిగా అక్కడికి వచ్చిన విద్యార్థినుల తల్లిదండ్రులు శానిటేషన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో వారే స్కూల్ చుట్టుపక్కల పరిసరాలను క్లీన్ చేశారు. మంగళవారం మరోసారి హాస్టల్ దగ్గరికి వచ్చిన బాలికల తల్లిదండ్రులు మళ్లీ అదే పరిస్థితి ఉండటంతో ఆందోళనకు దిగారు. హాస్టల్లోని వంట రూమ్ ను వారు పరిశీలించారు. కూరగాయాలు మురిగిపోయాయని.. బియ్యంలో పురుగులు ఉన్నాయన్నారు. హాస్టల్లో కనీసం 10 బాత్రూంలు కూడా లేవన్నారు.
సరైన వసతులు లేవని.. శానిటేషన్ నిర్వహణ ఆగమాగం ఉందన్నారు. ఈ విషయమై ప్రిన్సిలప్ శ్రీలక్ష్మిని వారు ప్రశ్నించగా.. ఆమె సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుండటంతో గొడవకు దిగారు. తమ పిల్లలకు ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. మహేశ్వరానికి హాస్టల్‌ను తరలిస్తే అక్కడి స్థానిక నేతలు, అధికారులైనా పట్టించుకోనేవారని తల్లిదండ్రులు చెప్తున్నారు. చదువు లేకపోయినా సరే ఈ హాస్టల్ లో ఉండొద్దంటూ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకెళ్లారు.ప్రస్తుతం హాస్టల్లో 50 శాతం విద్యార్థినులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. బాలికల గురుకుల స్కూల్ లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు దేవేందర్ , ఏబీవీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి డిమాండ్ చెశారు. బుధవారం గురుకుల స్కూల్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్, గురుకుల స్కూల్ అద్దె బిల్డింగ్ లో నిర్వహిస్తున్నారు. ఈ బిల్డింగ్ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతకు చెందినదిగా తెలుస్తోంది. ఈ బిల్డింగ్ రెంట్ సుమారు రూ.4 లక్షలను ప్రభుత్వం సదరు నేతకు చెల్లిస్తున్నట్లు సమాచారం.
