రెండేండ్లయినా నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

రెండేండ్లయినా నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

సర్కార్ ప్రకటించిన 80 వేల ఖాళీల్లోనూ లేని ప్రస్తావన

హైదరాబాద్, వెలుగు: అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు ఆఫీసర్ల నియామక ప్రతిపాదన అటకెక్కింది. కొత్త మున్సిపల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు వార్డుకో ఆఫీసర్‌‌ చొప్పున నియమిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించి రెండేండ్లవుతున్నా నోటిఫికేషన్​ విడుదల కాలేదు. నియామకాలకు సంబంధించి విధివిధానాలను కూడా రూపొందించలేదు. రాష్ట్రంలో ఉన్న 129 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు, జీహెచ్‌‌ఎంసీలో కలిపి మొత్తం 3,618 వార్డులు ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం.. పారిశుధ్యం, హరితహారంతో పాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలకు సేవలందించేందుకు వార్డు ఆఫీసర్​ పోస్టులను భర్తీ చేస్తామని 2020 సెప్టెంబర్ 16న మండలిలో కేటీఆర్ ప్రకటించారు.

పంచాయతీ కార్యదర్శుల మాదిరిగానే వార్డు ఆఫీసర్లకు మూడేండ్ల ప్రొబేషన్‌‌ ఉంటుందని, వారి పనితీరును బట్టి రెగ్యులరైజ్​ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వీరు వారథులుగా ఉంటారన్నారు. కానీ రెండేండ్లుగా ఈ పోస్టుల భర్తీని ప్రభుత్వం పట్టించుకోలేదు. శాఖల వారీగా సర్కార్ ప్రకటించిన 80,039 పోస్టుల్లోనూ వీటి ప్రస్తావన లేదు. దీంతో ఈ పోస్టుల భర్తీ ఇక ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.