నో ఎల్ఆర్ఎస్​..నో రిజిస్ట్రేషన్

నో ఎల్ఆర్ఎస్​..నో రిజిస్ట్రేషన్

హైదరాబాద్, వెలుగు: దాదాపు 3 నెలల తర్వాత నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎల్ఆర్ఎస్ కాని ఓపెన్ ప్లాట్ల స్లాట్ బుకింగ్ కు అవకాశం ఇవ్వలేదు. ఎల్ఆర్ఎస్ అయిన ఓపెన్ ప్లాట్లకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్​(వీఎల్​టీ) వసూలుకు కేటాయించే ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్(పీఐటీఎన్) ఉంటేనే కొత్త విధానంలో స్లాట్ బుక్ అవుతోంది. ఈ నంబర్​ లేని ఓపెన్ ప్లాట్లను రిజిస్టర్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించలేదు. దీంతో అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, పిల్లల పెళ్లిళ్లు తదితర అత్యవసర ఖర్చులు ఉన్న వ్యక్తులు తమ ప్లాట్లను అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. అంతేగాక ఎల్ఆర్ఎస్ అయ్యే దాకా ఆ ప్లాట్లలో ఇండ్ల నిర్మాణం కూడా చేపట్టలేని పరిస్థితి. 2015 నాటి ఎల్ఆర్ఎస్ పాత అప్లికేషన్లే వేలాదిగా పెండింగ్​లో ఉన్నాయని, ఇప్పుడు 25 లక్షలకుపైగా వచ్చిన కొత్త అప్లికేషన్ల పరిష్కారానికి ఎన్నేళ్లవుతుందోనని ఓపెన్ ప్లాట్ల ఓనర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అవసరాలకు  ప్లాట్లను అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ కాని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం చెప్పడంతో ప్రభుత్వ ప్రకటన కోసం జనం ఎదురుచూస్తున్నారు.

నెలన్నర రోజులు.. 25.59 లక్షల అప్లికేషన్లు

ఈ ఏడాది ఆగస్టు 31న ప్రారంభమైన ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల తుది గడువు అక్టోబర్ 31తో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అనధికార లే అవుట్లలో ఉన్న ఖాళీ ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కలిపి ప్రభుత్వ అంచనాకు మించి 25,59,562 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధి నుంచే అత్యధికంగా 1,06,891 అప్లికేషన్లు రాగా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,01,033, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 51,395 అప్లికేషన్లు అందాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 2021 జనవరి 31లోగా నిర్ణీత ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్​లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం విధించిన గడువుకు నెలన్నర రోజులే మిగిలి ఉందని, ఇంత తక్కువ సమయంలో 25 లక్షలకుపైగా ప్లాట్ల తనిఖీ సాధ్యమవుతుందా అని ప్లాట్ల ఓనర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో 2015 నాటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో 2 లక్షలకుపైగా అప్లికేషన్లు రాగా.. ఇప్పటికీ పరిష్కారం కాని అప్లికేషన్లు 35 వేల వరకు ఉన్నాయి. వీటి పరిష్కారానికే అపసోపాలు పడుతున్న యంత్రాంగం.. 25 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి ఎన్నేళ్లు టైం పడుతుందని అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్లు డౌట్ పడుతున్నారు.

సొంత ప్లాట్​లో ఇల్లు కట్టుకోవాలన్నా ఎల్ఆర్ఎస్

ఎల్ఆర్ఎస్ కాని సొంత ప్లాట్లలో ఇల్లు కట్టుకుందామన్నా సర్కారు అనుమతి ఇవ్వడం లేదు. ఇంటి నిర్మాణ అనుమతులకు కొత్తగా తీసుకొచ్చిన బీ పాస్ పోర్టల్​లో ఇంటి పర్మిషన్ అప్లికేషన్​లో ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ నంబర్ అడుగుతున్నారు.

నిర్మాణంలో ఉన్న ఇళ్లకు పీటీఐఎన్ ఎట్ల?

ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌‌ స్లాట్ బుకింగ్ అప్లికేషన్​లో ప్రాపర్టీ ట్యాక్స్‌‌ ఐడెంటిఫికేషన్‌‌ నంబర్‌‌(పీటీఐఎన్‌‌) లేదా ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్‌‌ నంబర్‌‌ (పీఐఎన్‌‌) లేదా అసెస్‌‌మెంట్‌‌ నంబర్​ను సర్కారు తప్పనిసరి చేసింది. నిర్మాణం పూర్తయి ఇంటి పన్ను వచ్చిన ఇళ్లకు పీటీఐఎన్ ఉండగా, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ఈ నంబర్ రాలేదు. నిర్మాణ దశలోనే ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను చూపించి బ్యాంకు లోన్​ కు అప్లై చేసుకునేవారు. అయితే నిర్మాణం పూర్తి కాని ఇళ్లను అసెస్ చేసి పీటీఐ నంబర్ ఇవ్వడం కుదరదు. ఈ పీటీఐ నంబర్ లేకుండా రిజిస్ట్రేషన్​కు స్లాట్ బుకింగ్ చేసుకోవడం కూడా వీలుకాదు. రిజిస్ట్రేషన్ కానిదే బ్యాంకు లోన్​ మంజూరయ్యే పరిస్థితి లేదు. పీటీఐ నంబర్​తో ఇదంతా ముడిపడి ఉండడంతో కొనుగోలుదారులు కూడా వెనకాడుతున్నారని పలువురు బిల్డర్లు చెప్పారు.

స్లాట్ బుకింగ్​కు రెండో రోజూ తిప్పలే

నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకునేందుకు జనానికి ఇబ్బందులు తప్పలేదు. స్లాట్ బుకింగ్ ప్రారంభమైన రెండో రోజు కూడా పోర్టల్ లో కొన్ని ఆప్షన్లు ఓపెన్ కాలేదు. కేవలం ఇండిపెండెంట్ ఇళ్ల సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ల కు మాత్రమే పోర్టల్ స్లాట్ బుకింగ్ తీసుకుంటోందని, గిఫ్ట్ డీడ్, మార్టిగేజ్, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు స్లాట్లు బుక్ కాలేదని డాక్యుమెంట్ రైటర్లు చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే హెచ్ఎండీఏ పరిధిలోని అనేక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిలో స్లాట్స్ ఖాళీగా ఉన్నట్లు పోర్టల్ లో చూపిస్తున్నా.. బుకింగ్ మాత్రం కావడం లేదని తెలిపారు.

ఉద్యోగులకు సెలవులు రద్దు

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌‌కు ఇప్పటికే స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ మొదలుకానుండటంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, ఉద్యోగులకు శని, ఆదివారం సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. రెండు రోజులు తప్పనిసరిగా డ్యూటీకి రావాలని రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అండ్ ఐజీ శేషాద్రి ఉత్తర్వులు జారీ చేశారు.