రైతు డిస్కంలో చేరేందుకు ఉద్యోగుల నుంచి భారీ స్పందన

రైతు డిస్కంలో చేరేందుకు  ఉద్యోగుల నుంచి భారీ స్పందన
  •     2 వేల పోస్టులకు 2,576  దరఖాస్తులు 
  •     511 ఇంజినీర్​ పోస్టులకు 1,254 మంది అప్లై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్​లో చేరడానికి ఉద్యోగుల నుంచి భారీ స్పందన వచ్చింది. గడువు ముగిసే నాటికి 2 వేల పోస్టులకు 2,576 మంది ఉద్యోగుల నుంచి దరఖాస్తులు వచ్చాయి.  511 ఇంజినీర్ల పోస్టులకు 1,254 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాన్​ ఇంజినీర్స్, ఆర్టిజన్​ పోస్టులకు కాస్త తక్కువగా అప్లయ్​ చేసుకున్నారని ఆఫీసర్లు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్​ 2 నాటికి రైతు డిస్కం పూర్తిస్థాయిలో సిద్ధం కానుందని ఆఫీసర్లు తెలిపారు. 

ఇంజినీర్ల పోస్టులకు రెట్టింపు దరఖాస్తులు

రైతు డిస్కమ్​లో చేరే ఇంజినీర్లకు పదోన్నతులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన జీఓ కూడా జారీ చేసింది. ఏఈఈ, ఏఈలను ఏడీఈలుగా, ఏడీఈలను డీఈ, ఈఈలుగా, డీఈలను ఎస్​ఈలుగా, ఎస్​ఈలను సీఈలుగా ప్రమోషన్​ ఇస్తామని చెప్పడంతో ఆయా పోస్టులకు భారీ డిమాండ్​ ఏర్పడింది. దీంతో 5 చీఫ్​ ఇంజినీర్​ పోస్టులకు పది మంది, 14 ఎస్ఈ పోస్టులకు 111 మంది, 43 డీఈ పోస్టులకు 247, ఏడీఈ పోస్టులు 129 ఉండగా 424, ఏఈ పోస్టులు 309 ఉండగా 417 మంది దరఖాస్తు చేసుకున్నారని రైతు డిస్కమ్​ ఆఫీసర్లు వివరించారు. సివిల్​ విభాగంలో కూడా 11 పోస్టులకు 45 మంది ఇంజినీర్ల నుంచి దరఖాస్తులు అందాయని తెలిపారు. నాన్ ఇంజినీరింగ్ పోస్టులు 1,115 ఉండగా 1,087, ఆర్టిసన్ పోస్టులు 374 ఉండగా 235 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. 

దుష్ప్రచారాన్ని నమ్మని ఉద్యోగులు

రైతు డిస్కమ్​పై మొదట ఆ డిపార్ట్​మెంట్​లో దుష్ఫ్రచారం జరిగింది. ఆ డిస్కమ్​లో చేరే ఉద్యోగులకు జీతాలు ఇవ్వరని, డిస్కమ్​ను ప్రైవేటీకరిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో తొలుత డిప్యూటేషన్​లో చేరడానికి కూడా ఉద్యోగులు ఎవ్వరూ ముందుకు రాలేదు. రైతు డిస్కమ్​ను ప్రైవేటీకరించబోమని స్వయంగా ప్రభుత్వం ప్రకటించినా ఉద్యోగులు ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. జీఓలో తెలిపిన విధంగానే ప్రమోషన్లకు సంబంధించిన పూర్తి సమాచారంతో  రైతు డిస్కమ్​ సీఎండీ సర్క్యులర్​ జారీ చేసి ఉద్యోగులకు ఆన్​లైన్​ ఆప్షన్లు చేసుకునే వెసులుబాటు కల్పించారు. రైతు డిస్కం పరిధి విస్తృతంగా ఉండటం, భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉండబోతున్నాయనే నమ్మకాన్ని ఉద్యోగులకు కల్పించారు. దీంతో అప్పుడు రైతు డిస్కమ్​లో చేరవద్దని ప్రచారం చేసిన కొందరు యూనియన్​ నాయకులే పోస్టుల కోసం అప్లయ్​ చేసుకోవడం మొదలుపెట్టారు. తీరా గడువు ముగిసే నాటికి ఊహించిన దాని కన్నా  పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఇప్పుడు సెలక్షన్​ చేసి పోస్టింగ్​లు ఇవ్వడం రైతు డిస్కమ్​ హెచ్ఆర్​ డిపార్ట్​మెంట్​కు పెద్ద తలనొప్పిగా మారింది.