థర్మకోల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. కాలిపోయిన సామగ్రి 

థర్మకోల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. కాలిపోయిన సామగ్రి 

ఇబ్రహీంపట్నం, వెలుగు :  ప్లాస్టిక్, థర్మకోల్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో  షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగిన ఘటన ఇబ్రహీంపట్నం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శేరిగూడ సమీపంలో రిషబ్ ఇండస్ట్రీస్ పేరుతో ప్లాస్టిక్​, థర్మకోల్ ఫ్యాక్టరీ ఉంది. శుక్రవారం అర్ధరాత్రి  ఒక్కసారిగా కంపెనీలో మంటలు వ్యాపించడంతో కొందరు కార్మికులు బయటికి పరుగులు పెట్టారు.  పోలీసులు, ఫైర్​​అధికారులకు సమాచారం ఇవ్వగా 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.  

మంటల ధాటికి ప్లాస్టిక్, థర్మకోల్ ప్రొడక్ట్స్ పూర్తిగా కాలిపోయాయి.  ఫ్యాక్టరీలోని ఎక్కువభాగం కాలి బూడిదైంది.  ఫైరింజన్ల సాయంతో మంటలు ఇంకా వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.  మంటలను కొన్ని గంటల్లోనే అదుపులోకి తెచ్చామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా ఫైర్ అధికారి పూర్ణ చందర్ రావు తెలిపారు.  మంటల ధాటికి షెడ్, మెషినరీ, ఒక టాటా వెహికల్, రెండు బైక్​లు పూర్తిగా కాలిపోయాయని రిషబ్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ యజమాని ఇబ్రహీంపట్నం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదుచేశారు.  రూ.2 కోట్లకు పైనే ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.