రాక్ బ్యాండ్.. ర్యాప్ సాంగ్స్ వినండి.. వెళ్లి ఓటేయండి

రాక్ బ్యాండ్.. ర్యాప్ సాంగ్స్ వినండి.. వెళ్లి ఓటేయండి

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓటు విలువను తెలియజేస్తూ, ఓటింగ్​శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ సంస్థలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. ఫస్ట్​ టైమ్​ఓటర్లే టార్గెట్ గా వినూత్న రీతిలో రాక్​బ్యాండ్ మ్యూజిక్, స్టాండప్​కామెడీ, స్లామ్ పోయెట్రీ, ర్యాప్​సాంగ్స్ తో ఎంటర్ టైన్ చేస్తూ ఓటుపై చైతన్యం చేస్తున్నాయి.  మరికొన్ని ఎన్జీవోలు ప్రధాన సర్కిల్స్​లో ప్ల కార్డులు, సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలతో యూత్​ఓటు హక్కును వినియోగించుకునేలా అవేర్ నెస్ కల్పిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోక్ సభ  సెగ్మెంట్​లో 36,723 మంది, సికింద్రాబాద్​ లోక్ సభ సెగ్మెంట్ లో 97,097 మంది, కంటోన్మెంట్​అసెంబ్లీ సెగ్మెంట్​లో 3,013 మంది.. 18 – 19 ఏండ్లు ఉన్న ఓటర్లు ఉన్నారు.

ఆలోచింప చేసే స్క్రిప్టులతో..

యూత్​లో అవేర్ నెస్  లేకపోవడంతో ఓటును వినియోగించుకోలేకపోతున్నారు. మరికొంతమంది ఓటు నమోదుకు కూడా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో సిటీకి చెందిన యంగిస్థాన్ సంస్థ కొన్నేండ్లుగా ఓట్​అవేర్ నెస్  ప్రోగ్రాములు చేస్తోంది. కాలేజీలు, పబ్ లు, కల్చరల్​సెంటర్లు, రెసిడెన్షియల్, గేటెడ్​ కమ్యూనిటీల్లో యూత్ ను టార్గెట్​చేసుకొని ప్రోగ్రామ్‌‌‌‌‌‌ నిర్వహిస్తోంది. రొటీన్​గా కాకుండా యూత్ ను ఎక్కువగా ఆకర్షించే పద్ధతిలో రాక్​బ్యాండ్ మ్యూజిక్, స్టాండప్​కామెడీ, ర్యాప్​సాంగ్స్, ఆలోచింప చేసే డ్రామా స్క్రిప్టులతో అవగాహన కల్పిస్తున్నారు. రాజకీయాలపై వారికున్న అనుమానాలను నివృత్తి చేయడమే కాకుండా సమస్యలపై లోకల్​లీడర్లను ప్రశ్నించడం, నోటాపై అవగాహన కల్పించడం, క్వశ్చన్​అండ్​ఆన్సర్స్​.. ఇలా డిఫరెంట్​పద్ధతుల్లో అవేర్ నెస్ చేస్తున్నాయి. 

అర్బన్​ యూత్ లో అవగాహన​ తక్కువే

యూత్ రాజకీయాలను ఎక్కువగా పట్టించుకోరు. ఓటు వేయకపోతే ఏం ఫరక్​పడదులే అనుకుంటారు. అలాంటి యూత్​కు ఎలా చెబితే అర్థం అవుతుందో గ్రహించి అవేర్ నెస్  ప్రోగ్రాములు చేస్తున్నాం. ఓటుకు ఎలా అప్లై చేసుకోవాలి. స్థానిక సమస్యలు, నాయకులను ప్రశ్నించడం, ఎన్నికలకు సంబంధించి వారికున్న అనుమానాలు, ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.   - అరుణ్​ డానియల్ యెల్లమాటి, ఫౌండర్ యంగిస్థాన్​